తెలుగు రాష్ట్రాల ఆశలపై కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న బయ్యారం ఉక్కు కర్మాగారంతోపాటు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మాత్రమే విభజన చట్టంలో ఉందన్న కేంద్రం తొలి ఆరు నెలల్లోనే సాధ్యం కాదని తేల్చి చెప్పామన్నారు. అయితే మరింత పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్న సూచనలు రావడంతో కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని స్పష్టమైన నివేదిక ఆధారంగా సాధ్యంకాదని తేల్చామన్నారు.
విభజన హామీల అమలుపై తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో ఏపీ, తెలంగాణలో స్టీల్ ఫ్యాక్టరీల నిర్మాణం సాధ్యం కాదనే రిపోర్టులు వచ్చాయని కేంద్రం తెలిపింది. అయినా మరో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం మెకాన్ సంస్థ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరుపుతోందని, ఆ సంస్థ పూర్తిస్థాయి నివేదిక ఇవ్వలేదని కేంద్రం కోర్టుకు తెలిపింది. మెకాన్ సంస్థ రెండు రాష్ట్ర ప్రభుత్వాలతోనూ సమాచారం పంచుకుంటోందని, కడప స్టీల్ ప్లాంట్‌తో పాటు బయ్యారం వ్యవహారం కూడా టాస్క్ ఫోర్స్ పరిధిలో ఉందని అన్నారు.
అయితే కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం తాను దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ప్రకటించారు. ప్రధాని అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలిపిన సీఎం రమేష్ కడప స్టీల్ ప్లాంట్‌తోపాటు విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని కోరనున్నట్లు తెలిపారు. విభజన హామీలన్నింటిని నెరవేరిస్తేనే బీజేపీకి కనీస గౌరవం దక్కుతుందన్నారు.