హైకోర్టు విభజనపై రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ

Update: 2018-12-20 06:16 GMT

ఉమ్మడి హైకోర్టు విభజనకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏప్రిల్ 7 న అంటే ఉగాది రోజున అమరావతిలో హైకోర్టు ప్రస్థానం ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో  సంక్రాంతి సెలవుల తర్వాత హైకోర్టు తరలింపు ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి హైకోర్టు విభజనకు మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో చెప్పిన విధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా హైకోర్టులను ఏర్పాటు చేసే కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీ హైకోర్టు అపాయింటెండ్‌ డేగా ఏప్రిల్ 7వ తేదీని ఖరారు చేస్తూ రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ నిన్న ఉత్త‌ర్వులు జారీ చేశారు. 2019 ఏప్రిల్ 7 నుంచి హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి హైకోర్టు ఇక ఏపీ-తెలంగాణ హైకోర్టుగా విడిపోనుంది.

హైకోర్టు విభజనపై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు వచ్చే ఏడాది జనవరి 1 నాటికి కేంద్రం విభజన నోటిఫికేషన్‌ జారీ చేస్తుందని భావిస్తూ వ్యాఖ్యానించింది. డిసెంబర్‌ 15 నాటికి అమరావతి పరిధిలోని నేలపాడులో హైకోర్టు భవనం సిద్ధమవుతుందని ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు తెలిపింది. అమరావతిలో హైకోర్టు నిర్మాణం పూర్తయితే హైకోర్టును ఏపిలో ఏర్పాటు చేయటానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్రం కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం అమరావతి లో జస్టిస్ సిటీ నిర్మాణం తుది దశకు చేరుకోవటంతో వచ్చే వేసవి సెలవుల్లో అంటే ఏప్రిల్ 7వ తేదీన ఏపీ హైకోర్టు అప్పాయింటెడ్ డే గా రాష్ట్రపతి నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అమరావతిలో హైకోర్టు నిర్మాణం పూర్తి కాగానే సంక్రాంతి సెలవుల తర్వాత తరలింపు ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అధికారికంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2019, ఏప్రిల్ 7వ తేదీన పని చేయటం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 7న తెలుగు సంవత్సరాది ఉగాది కావటంతో ఆరోజునే  హైకోర్టు అప్పాయింటెడ్ డేగా ప్రకటిస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేశారు. 

Similar News