ఇంత బాధ్యత గల ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్న బాబు

Update: 2018-12-18 05:12 GMT

పెథాయ్‌ తుపానుపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సైక్లోన్‌పై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన చంద్రబాబు ప్రాణనష్టం, పశు నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. ఇవాళ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న ఆయన దేశంలో ఇలాంటి బాధ్యత గల ప్రభుత్వం మరెక్కడా లేదన్నారు. 

పెథాయ్‌ తుపానును సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తుపాను ప్రభావంపై సచివాలంయలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన చంద్రబాబు నష్టాన్ని ముందుగానే అంచనా వేసి ప్రాణ నష్టాన్ని నివారించగలిగినట్లు తెలిపారు. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా పెథాయ్‌కు ముందు నుంచే సన్నద్దమైనట్లు వివరించారు. ఇవాళ ఆయన తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న చంద్రబాబు., అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

దేశంలో ఇంత బాధ్యత గల ప్రభుత్వం ఎక్కడా లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంత త్వరగా తుఫాన్ సహాయచర్యలు ఎక్కడా జరగలేదని రియల్ టైమ్‌లో సమస్యను పరిష్కారిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. జియో ట్యాగింగ్‌తో విద్యుత్‌ స్థంభాల పునరుద్ధరణ సులభమైందని నష్టాన్ని అంచనా వేసి గంటల వ్యవధిలో పునరుద్ధరణ చేయాలని సూచించారు. అధికారులు చురుగ్గా వ్యవహరించి క్షేత్రస్థాయిలో పనిచేయాలని డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ ఎలా పనిచేసిందో డాక్యుమెంటరీ చేయాలని అధికారులకు సూచించారు. 

రెండు రోజుల్లో పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. 20 వ తేదీ కల్లా నష్ట పరిహారాన్ని అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే తుపాను నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని రాష్ట్రాలకు ఇబ్బందులు వస్తే సహకరించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని చంద్రబాబు అన్నారు. 

Similar News