టీఆర్ఎస్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు...టీఆర్ఎస్‌తో పొత్తుపై...

Update: 2018-12-18 04:52 GMT

తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ కలిసి ఉండాలనేదే తన అభిలాష అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టీఆర్ఎస్‌తో పొత్తు తదితర అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించిన చంద్రబాబు తానెప్పుడూ టీఆర్ఎస్‌ తో పొత్తు కోసం వెంపర్లాడలేదని తేల్చిచెప్పారు. అంతేకాకుండా కేంద్రంలోని బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుందని అందుకు మూడు రాష్ట్రాల ఎన్నికలే సంకేతమని స్పష్టం చేశారు. పెథాయ్‌ తుపాను సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే ఏపీలోని ప్రతిపక్షాలు సంబరాలు జరుపుకుంటున్నాయని మండిపడ్డారు. టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలనే కోరికతో తానెప్పుడూ లేనన్న చంద్రబాబు ప్రత్యేక హోదాపై అడ్డం తిరగడం వల్లే ఆ పార్టీని వ్యతిరేకించాల్సి వచ్చిందన్నారు. 

ఇటు కేంద్రం తీరుపై కూడా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. మూడు రాష్ట్రాల్లో ఓటమే ఆ పార్టీకి దేశవ్యాప్తంగా వీస్తున్న వ్యతిరేక పవనాలకు సంకేతమని చంద్రబాబు అన్నారు. పెద్దనోట్లు రద్దు చేయాలని తానెప్పటి నుంచో కోరుతున్నానన్న చంద్రబాబు ఒక పెద్ద నోటు తీసి మరో పెద్ద నోటు తీసుకురావడంతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌ను ప్రపంచంలో ఎవరూ వినియోగించడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచమంతా పేపర్ బ్యాలెట్‌కు వెళ్తుంటే మనం ఎందుకు ఎలక్ట్రానిక్ ఓటింగుకు వెళ్లాలని ప్రశ్నించారు. ఈవీఎంను సులభంగా ట్యాంపరింగ్‌ చేయొచ్చని ప్రజాస్వామ్యాన్ని కొంతమంది చేతిలో పెట్టే అవకాశం ఎందుకు ఇవ్వాలని చంద్రబాబు చెప్పారు. 
 

Similar News