ఎన్నికల్లో గెలుపొందడం లక్ష్యం నరేంద్ర మోడీ పావులు...మూడు కొత్త పథకాలకు కసరత్తు చేస్తున్న కేంద్రం
2019 ఎన్నికల్లో గెలుపొందడం లక్ష్యంగా...నరేంద్ర మోడీ పావులు కదుపుతున్నారు. మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు మూడు కొత్త పథకాలపై కసరత్తు చేస్తున్నట్లు జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. దేశవ్యాప్తంగా 50 కోట్ల మందికి లబ్ది చేకూరేలా...ఈ పథకాలు అమలు చేయనున్నట్లు సమాచారం. వివిధ రంగాల్లో పనిచేసే వారికి వృద్ధాప్య పింఛను, జీవిత బీమా, ప్రసూతి ప్రయోజనాలు పటిష్టంగా అమలు చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం 15 కేంద్ర కార్మిక చట్టాలను సరళీకరించి, ఒకే చట్టంగా విలీనం చేయడానికి ఓ ముసాయిదా బిల్లును రూపొందించినట్లు సమాచారం. అన్ని రంగాల్లో ఉపాధి పొందేవారికి ఈ పథకాలు వర్తించే విధంగా... బిల్లును రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లును జూలైలో పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.