తాను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని తెగేసి చెప్పిన కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఎట్టకేలకు మనసు మార్చుకున్నారు. పార్టీ సీనియర్ నేతలు, ఢిల్లీ అధిష్టానం పెద్దలు ఆమెను పోటీకి ఒప్పించారు. గతంలో మెదక్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన రాములమ్మ ఇప్పుడదే పార్లమెంట్ సెగ్మెంట్ అయిన దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రకటించనున్న రెండో జాబితాలో విజయశాంతి పేరు ఉండటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. వాస్తవానికి విజయశాంతి తాను కేవలం ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం కావాలని అనుకున్నారు. కాని ఆమె ఎట్టిపరిస్థితుల్లో పోటీ చెయ్యాలని కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీకి సూచించిందట.. దాంతో పీసీసీ పెద్దలు విజయశాంతిని పోటీకి ఒప్పించారట. ఈ క్రమంలో ఇదివరకే తనకు పరిచయాలు ఉన్న దుబ్బాక నియోజకవర్గం అయితేనే బావుంటుందనే ఆలోచనతో విజయశాంతి ఈ నిర్ణయం తీసుకున్నారట.