బ్యాంకు ఉద్యోగులు మరోమారు సమ్మె బాట పట్టారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి రేపు అర్ధరాత్రి వరకు సమ్మె చేయనున్నట్లు ఏపీ, తెలంగాణ ఐబ్యాక్ సెక్రటరీ జి.సుబ్రహ్మణ్యం తెలిపారు. 11వ వేతన సవరణ చేపట్టడంతో పాటు.. బ్యాంకుల విలీనాన్ని ఉపసంహరించుకోవాలని.. దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో నాలుగు యూనియన్లకు చెందిన మూడున్నర లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు ఈ నెల 21 నుంచి 26 వరకు.. ఒక్క 24వ తేదీ మినహా బ్యాంకులు పనిచేయవు. 22, 23 తేదీలు శని, ఆదివారాలు కాగా 25 వ తేదీ క్రిస్మస్ కారణంగా బ్యాంకులకు సెలవు. 26న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ సమ్మెకి పిలుపునిచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంకు, విజయా బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేపడుతున్నాయి. దాంతో వరుసగా బ్యాంకులకు సెలవులు ఉండటంతో నగదు అవసరమైన ప్రజలు ఏటిఎంలకు క్యూ కడుతున్నారు. అంతేకాదు ఇవాళ ఒక్కరోజే బ్యాంకు పనిచేస్తుండటంతో వివిధ బ్యాంకుల్లో రద్దీ సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంది.