శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత

Update: 2018-12-23 06:55 GMT

శబరిమలలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనితీ సంస్థ తరపున ఆరుగురు మహిళా భక్తుల బృందం ఒకటి ఈ తెల్లవారుజామున పంబ బేస్‌ క్యాంప్‌కు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మదురై నుంచి రోడ్డు మార్గం గుండా ప్రయాణించి వీరు పంబకు చేరుకున్నట్లు చెబుతున్నారు. వీరితో పాటు మరో ఐదుగురు మహిళలు వేరే మార్గం గుండా పంబకు చేరుకున్నారు. ఇలా మొత్తం పంబ బేస్‌ క్యాంప్‌ దగ్గరకు 30 మంది మహిళలు చేరుకోవడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. మనితి సంస్థ తరపున తరలివచ్చిన ఈ మహిళలంతా 50 యేళ్లలోపు వారే కావడంతో వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొండ ఎక్కకుండా తాము అడ్డుకుంటామని ఆందోళనకారులు చెబుతుంటే దర్శనం చేసుకుంటామని మహిళా భక్తుల బృందం తెగేసి చెబుతోంది. గతంలోనే దర్శనానికి తమకు అనుమతివ్వాలంటూ మనితి సంస్థ మహిళా బృందం కేరళ సీఎం పినరయికి లేఖ రాసింది. దీంతో మూకుమ్మడిగా వెళ్తే అడ్డుకుంటారని తెలిసే వీరంతా వేర్వేరు బ్యాచ్‌లుగా విడిపోయి ఆలయానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇటు ఆలయ పరిసరాల్లో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఇటు కొట్టాయం విమానాశ్రయంలో మనితికి చెందిన ఒక బృందాన్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లాలంటూ నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భద్రతను పెంచారు. 

Similar News