వీడియోలో ఏదైనా వస్తువు నచ్చిందా.. ఇక అక్కడినుంచే కొనుగోలు.. యూట్యూబ్ కొత్త ఫీచర్ త్వరలో!
గూగుల్ మరో కొత్త ట్రెండ్ తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు యూ ట్యూబ్ లో వీడియోలు మాత్రమే చూస్తున్నాం. త్వరలో వీడియో చూస్తూనే మనకు కావలసిన వస్తువును అక్కడినుంచే ఆర్డర్ చేసి నేరుగా ఇంటికి రప్పించుకునే అవకాశాన్ని కల్పించబోతోంది గూగుల్. అర్థం కాలేదా.. ఇపుడు అమెజాన్.. ఫ్లిప్ కార్ట్ లతో ఎలాగైతే కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తున్నామో అదేవిధంగా ఇకపై యూ ట్యూబ్ నుంచి కూడా వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కల్పించబోతున్నారు.
ప్రజల అవసరాలు ఎలాఉంటాయో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటికి అనుగుణంగా తన వ్యాపారాన్ని విస్తరించుకునే గూగుల్ ఇప్పుడు ఈ కామర్స్ రంగంలోకి దూసుకురాబోతోంది. ఇప్పటికే పలు నివేదికలు చెబుతున్న దాని ప్రకారం త్వరలోనే యూ ట్యూబ్ నుంచి కొనుగోళ్లు జరిపే అవకాశం ఉంది.
ఈ మేరకు యూట్యూబ్ యాప్ లో మార్పులు చేసేందుకు డెవలపర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ప్రపంచంలో అతి పెద్ద వీడియో హబ్ అయిన యూట్యూబ్ ఇకపై షాపింగ్ హబ్ గా మారిపోనుంది. ఈ మేరకు తన క్రియేటర్లకు గూగుల్ ఇప్పటికే సూచనలు ఇచ్చింది. షాపింగ్ ప్రొడక్టుల ఫీచర్లను ట్రాక్ చేయడం..టాగ్ చేయడం వంటి అంశాలను పరిశీలించమని క్రియేటర్లను కోరింది. ఇది పూర్తయ్యాకా సంబంధిత డాటా గూగుల్ అనలిటిక్స్, షాపింగ్ టూల్స్ తోఅనుసంధానిస్తారు. దీంతో వినియోగదారులు యూట్యూబ్ నుంచి కొనుగోళ్లు జరిపే అవకాశం ఏర్పడుతుంది.
మనం ఒక వీడియో చూస్తున్నపుడు అందులో మనకు నచ్చిన వస్తువును అక్కడి నుంచే నేరుగా కొనుగోలు చేసేలా గూగుల్ యూట్యూబ్ షాపింగ్ హబ్ ను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పద్ధతిలో కనుక యూట్యూబ్ షాపింగ్ సైట్ తయారైతే, ఇప్పుడు ఈ కామర్స్ రంగంలో అగ్రగామి గా ఉన్న అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వడం ఖయామని నిపుణులు భావిస్తున్నారు.