Salary Insurance: శాలరీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా.. ఎవరు అర్హులంటే..?
Salary Insurance: శాలరీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా.. ఎవరు అర్హులంటే..?
Salary Insurance: కరోనా వల్ల చాలామంది ఉపాధి కోల్పోయారు. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని రన్ చేయడం చాలా కష్టమవుతుంది. అందుకే ఉద్యోగం చేసే వ్యక్తి తాను ఉన్నప్పుడు లేనప్పుడు కుటుంబానికి నెలవారీ ఆదాయం రావాలని కోరుకుంటాడు. అందుకోసం ఒకదారి ఉంది. అదే శాలరీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్. దీనిని తీసుకుంటే మీ కుటుంబానికి నిరంతరం ఆదాయం ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ అనేది మీరు ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు జీతం అందించదు కానీ అనుకోని మరణం సంభవించినప్పుడు కుటుంబానికి అండగా నిలుస్తుంది.
శాలరీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ ఒక టర్మ్ ప్లాన్. ఇందులో మీకు 2 ఆప్షన్లు లభిస్తాయి. హామీ మొత్తం.. ఏక మొత్తంగా అందించడం లేదంటే క్రమమైన ఆదాయాన్ని అందించడం. అందుకే దీనిని ఇన్‌కమ్ ప్రొటక్షన్ ప్లాన్ అంటారు. నెలవారీగా అందించే ఆదాయం పాలసీదారుని ప్రస్తుత జీతంతో ముడిపడి ఉంటుంది. ఈ ప్లాన్‌ని ఎంచుకున్నవారు.. హామీ మొత్తం ఏవిధంగా నామినీకి అందించాలో పాలసీ కొనుగోలు సమయంలోనే బీమా సంస్థకు తెలియజేయాలి. ఇక్కడ రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
హామీ మొత్తం రెండు భాగాలుగా అంటే.. ఏకమొత్తం, నెలవారీ ఆదాయంగా విభజించవచ్చు. ఈ విధానంలో దేనికి ఎంత మొత్తం కేటాయించాలో పాలసీదారుడే తెలియజేయాలి. మొత్తం హామీని క్రమమైన ఆదాయంగా (రెగ్యులర్ ఇన్‌కమ్ పే అవుట్ ఆప్షన్‌తో) చెల్లించేలా టర్మ్ పాలసీని ఎంచుకోవచ్చు. ముందే చెప్పుకున్నట్లుగా ఇది ఒక టర్మ్ పాలసీ. అందువల్ల పాలసీదారునికి ఎటువంటి మెచ్యూరిటీ ప్రయోజనాలూ అందవు. పాలసీదారుడు, పాలసీ కాలవ్యవధిలో మరణిస్తే.. హామీ మొత్తం పాలసీలో ముందుగా నిర్ణయించిన ప్రకారం నామినీకి అందజేస్తారు. మీరు లేనప్పుడు కొన్ని సంవత్సరాల పాటు కుటుంబ అవసరాలను తీర్చేందుకు ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా పిల్లల ఉన్నత చదువులు, వివాహం వంటి ముఖ్య సమయాల్లో ఉపయోగపడుతుంది.