Blue Aadhaar card: ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి ఆధార్ కార్డు తప్పక ఉండాలి. ఈ ఆధార్ కార్డును యూనిక్ ఐటెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేస్తుంది. ప్రతి భారతీయుడికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తుంది. ఈ ఆధార్ సంఖ్య జనాభా, బయోమెట్రిక్ డేటాతో లింక్ అయి ఉంటుంది. వ్యక్తి గుర్తింపు, ఉండే నివాసానికి ఇదే అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగపడుతుంది. ఆధార్ ద్వారా అనేక ప్రభుత్వ పథకాలు, సేవలను పొందవచ్చు.
ఇది పెద్దలకే కాదు పిల్లలకు కూడా చాలా ముఖ్యం. స్కూల్ అడ్మిషన్ సమయంలో ఈ కార్డ్ కచ్చితంగా అవసరం. అందుకే నవజాత శిశువులకి కూడా ఆధార్ కార్డు ప్రవేశపెట్టారు. 5 ఏళ్లు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు అందించే ఆధార్ కార్డును బ్లూ ఆధార్ కార్డు అంటారు. దీనినే బాల్ ఆధార్ కార్డ్ అని కూడా పిలుస్తారు. 2018లో పిల్లల కోసం యూఐడీఏఐ ఈ ఆధార్ కార్డును ప్రవేశపెట్టింది.
బ్లూ ఆధార్ కోసం ముందుగా ఏదైనా ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి. ఇక్కడ బ్లూ ఆదార్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇది సాధారణ ఆధార్ కార్డు మాదిరిగానే ఉంటుంది. ఇందులో పిల్లల పేరు, వయస్సు, ఫొటో, చిరునామా తదితర వివరాలు ఉంటాయి. పిల్లల బయోమెట్రిక్ సమాచారం ఉండదు. పిల్లలకి 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి.
ఈ ఆధార్ కార్డు పొందడానికి ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను నింపి ఆధార్ కేంద్రంలో సమర్పించాలి. దీంతో పాటు కొన్ని అవసరమైన పత్రాలను జతచేయాలి. పిల్లల జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, ఆస్పత్రి డిశ్చార్జ్ సర్టిఫికెట్, విద్యుత్ బిల్లు వంటివి అవసరమవుతాయి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆధార్ కేంద్రం ఒక స్లిప్‌ని అందిస్తుంది. దీంతో మీరు ఆన్‌లైన్‌లో ఆధార్ స్టేటస్‌ని చెక్ చేయవచ్చు. కొద్ది రోజుల్లోనే బ్లూ ఆధార్ మీ ఇంటికి చేరుతుంది.