Petrol and Diesel Price Today: మరోసారి పెరిగిన చమురు ధరలు
* ప్రతిరోజు 35పైసలకు మించి పెరుగుతున్న పెట్రో ధరలు * లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంపు
Petrol and Diesel Price Today: దేశంలో లీటర్ పెట్రోల్ ధర 150 రూపాయలకు చేరుకుంటుందా అంటే నిజమేనేమో అన్నట్టు ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు. గత కొన్ని రోజులుగా పెట్రో రేట్లు ప్రతిరోజు పెరుగుతూ వస్తున్నాయి. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కోట్లాది మంది సామాన్యులపై పెట్రోల్, డీజిల్ ధరలు అదనపు భారాన్ని మోపుతున్నాయి. దీంతో సామాన్యుడు వాహనాన్ని బయటకు తీయాలంటేనే భయపడుతున్నాడు. రోజువారీ సంపాదనలో అధిక మొత్తంలో పెట్రోల్‌కే వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆయిల్ కంపెనీలు పెట్రో ధరలను పెంచడం ఆనవాయితీగా పెట్టుకున్నట్టున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. రెండు రోజులు బ్రేక్ ఇస్తే ఆ తర్వాత వారం రోజుల పాటు వరుసగా వాటి ధరలను పెంచే పరిస్థితి దేశంలో నెలకొంది.
ఈ ఏడాది మే 4న మొదలైన పెట్రో పెరుగుదల ఈ అయిదు నెలల పాటు వాహనదారులకు చుక్కలు చూపిస్తూ వచ్చింది. 45 నుంచి 50 రోజుల పాటు ప్రతిరోజూ వాటి రేట్లు పెరిగాయి. మధ్యలో కొంత విరామం తీసుకున్నా మళ్లీ ఆకాశానికి ఎగబాకుతున్నాయి.
ఇక ఇవాళ కూడా పెట్రో ధరలు మళ్లీ పెరగాయి. లీటర్ పెట్రోల్‌పై 37, డీజిల్‌పై 38 పైసలు పెంచాయి చమురు ధరలు. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రో రేట్లు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయలు కాగా డీజిల్ ధర 106 రూపాయల 22 పైసలకు పెరిగింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 114 రూపాయల 95 పైసలు ఉండగా లీటర్ డీజిల్ ధర 107 రూపాయల 56 పైసలకు పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 108 రూపాయల 64 పైసలకు చేరగా, డీజిల్ ధర 97 రూపాయల 37 పైసలకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ 114 రూపాయల 47 పైసలు, డీజిల్ 105 రూపాయల 49 పైసలకు ఎగబాకింది. కోల్‌కతాలో పెట్రోల్ 109 రూపాయల 2 పైసలు, డీజిల్ వంద రూపాయల 49 పైసలుగా ఉంది. ఇక చెన్నైలో పెట్రోల్ 105 రూపాయల 43 పైసలు, డీజిల్ 101 రూపాయల 59 పైసలుగా ఉన్నాయి.