రిటైర్మెంట్ ఫండ్‌ని క్రియేట్ చేయాలంటే ఈ పథకాలు బెస్ట్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం..!
Retirement Fund: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకుంటున్నారు.
Retirement Fund: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. మీరు 2-3 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నట్లయితే భవిష్యత్తు కోసం పొదుపు చేయడం చాలా అవసరం. ముఖ్యంగా రిటైర్మెంట్ ఫండ్‌కి ఎంత తొందరగా ప్లాన్ చేస్తే అంత ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటాయి. వృద్ధాప్యంలో మంచి ఆదాయం రావడానికి కొన్ని బెస్ట్ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల మీ డబ్బుకి భద్రతతో పాటు మంచి ఆదాయం సమకూరుతుంది. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
అటల్ పెన్షన్ యోజన
18 సంవత్సరాల వయస్సు నుంచి 40 సంవత్సరాల లోపు ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో 60 సంవత్సరాల వరకి ప్రతి నెలా చందా చెల్లించాలి. 60 సంవత్సరాల తర్వాత మీరు రూ.1000 నుంచి రూ.5000 వరకు నెలవారీ పెన్షన్ పొందుతారు. వృద్ధాప్యంలో పొందాలనుకుంటున్న పింఛను మొత్తానికి అనుగుణంగా మీరు ప్రతి నెలా చందా ఇవ్వాలి. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో రిజిస్టర్ చేసుకోవాలంటే సేవింగ్స్ అకౌంట్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఉండాలి.
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్
వృద్ధుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న గొప్ప పథకాల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS) ఒకటి. ఈ పథకం ముఖ్యంగా 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కాకుండా VRS తీసుకున్న 55 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి కూడా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలతో పోలిస్తే ఇందులో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ ఖాతాలో కనిష్టంగా 1000, గరిష్టంగా 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం కొత్త వడ్డీ రేట్లు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం పెట్టుబడిదారులు 8% వడ్డీని పొందుతున్నారు. త్రైమాసిక ప్రాతిపదికన డిపాజిట్ మొత్తంపై వడ్డీ లెక్కిస్తారు.
జాతీయ పెన్షన్ పథకం
మీరు పన్నురహిత పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ప్రభుత్వ జాతీయ పెన్షన్ పథకం ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు. ఈ పథకం సురక్షితమైన ప్లాన్‌లలో ఒకటి. ఇక్కడ పెట్టుబడి పెడితే డబ్బు మునిగిపోదు. అలాగే రిటైర్మెంట్ తర్వాత హాయిగా గడపవచ్చు. ఈ పథకంలో స్థిర పెన్షన్ పొందుతారు. 3 సంవత్సరాల పాటు నిరంతరంగా ప్రీమియం చెల్లించిన తర్వాత మీరు ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే మెచ్యూరిటీకి ముందు మొత్తం డిపాజిట్‌లో 25% మొత్తాన్ని మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.