Small Savings: పోస్టాఫీసులో పొదుపుకి ఈ పత్రాలు తప్పనిసరి.. లేదంటే అకౌంట్ తెరవలేరు..!
Small Savings: ఇకనుంచి పోస్టాఫీసు పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ పాన్, ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేసింది.
Small Savings: ఇకనుంచి పోస్టాఫీసు పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ పాన్, ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేసింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), సుకన్య సమృద్ధి యోజన (SSY), మహిళా సమ్మాన్ స్కీమ్ మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టడానికి ఇవి కచ్చితంగా అవసరం. దీనికి సంబంధించి ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంతకుముందు ఒక వ్యక్తి తన ఆధార్ నంబర్ లేకుండా పెట్టుబడి పెట్టవచ్చు. కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు.
ఆధార్ నంబర్ లేకపోతే ఏమి చేయాలి?
ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం పాన్, ఆధార్‌ను సమర్పించడం తప్పనిసరి. పోస్టాఫీసు స్కీమ్‌లలో ఖాతా తెరిచే సమయంలో వ్యక్తికి ఆధార్ నంబర్ లేకపోతే ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌కు స్లిప్ ప్రూఫ్‌గా ఇవ్వాలి. ఇది కాకుండా ఖాతా తెరిచిన తేదీ నుంచి ఆరు నెలలలోపు ఆధార్ నంబర్‌ను సమర్పించాలి. తద్వారా అది చిన్న పొదుపు పథకం పెట్టుబడితో అనుసంధానిస్తారు.
ఆరు నెలల్లోగా ఆధార్ నంబర్‌ను సమర్పించకపోతే ఆధార్ నంబర్‌ను సమర్పించే వరకు వ్యక్తి చేసిన పెట్టుబడిని స్తంభింపజేస్తారు. ఇది కాకుండా పెట్టుబడి కోసం ఖాతాను తెరిచే సమయంలో పాన్ లేదా ఫారం 60 సమర్పించాలని పేర్కొంది. ఖాతా తెరిచే సమయంలో పాన్‌ను సమర్పించకపోతే నిర్దిష్ట పరిస్థితుల్లో రెండు నెలలలోపు సమర్పించాలి. మోదీ ప్రభుత్వం ఇటీవల చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటును 70 బేసిస్ పాయింట్లు అంటే 0.70 శాతం వరకు పెంచింది. ఈ పెరుగుదల ఏప్రిల్ నుంచి జూన్ 2023 త్రైమాసికంలో జరిగింది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ 2023 మార్చి 31న ఒక సర్క్యులర్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే.