పప్పుల ధరలలో పెరుగుదల.. కారణం ఏంటంటే..?
Pulses Price: నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు.
Pulses Price: నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. తాజాగా పప్పుల ధరలు పెరిగాయి. గత 6 వారాల్లో ధరలు 15 శాతం పెరిగాయి. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. పప్పుధాన్యాల నిల్వలు, పరిమిత లభ్యత కారణంగా ఇది జరిగింది. వర్షాకాలంలో పప్పుధాన్యాల విస్తీర్ణం కూడా తక్కువగా ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పంటలని నాశనం చేశాయి. దీంతో సరఫరా మరింత తగ్గే అవకాశం ఉంది. అందుకే పప్పుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
వాస్తవానికి భారీ వర్షాల వల్ల పంట నష్టం వాటిల్లింది. అయితే మయన్మార్ నుంచి దిగుమతులు పెరిగే అవకాశం ఉన్నందున ధరలు పెద్దగా పెరగకపోవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పెసర ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో పంట మెరుగ్గా ఉంది. అంతేకాదు సరఫరా కూడా పెరుగుతుంది.
అయితే కందుల నిల్వ పరిమితంగా ఉంది. ఈ ఏడాది రైతులు సోయాబీన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కందిపప్పు, పెసరపప్పు ధరలపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఈ ఏడాది దేశంలో సక్రమంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల అతివృష్టితో పంటలు దెబ్బతినగా కొన్నిచోట్ల అనావృష్టితో పంటలు ఎండిపోయాయి. వ్యవసాయ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోల్చితే పప్పుల సాగు విస్తీర్ణం దాదాపు 5 శాతం తగ్గింది.