Stock Market: స్టాక్ మార్కెట్లకు అమ్మకాల సెగ
Stock Market: 2 శాతం వరకు నష్టపోయిన సన్ ఫార్మా షేరు విలువ
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల రికార్డుల పరుగుకు బ్రేక్ పడింది. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే అమ్మకాల సెగతో నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 70,000 కీలక మార్క్‌తో పాటు.. నిఫ్టీ 21,000 మైలురాయి నుంచి కిందకు వచ్చాయి. వరుస ర్యాలీ, రికార్డు గరిష్ఠాల నేపథ్యంలో మదుపర్లు లాభాలు స్వీకరించడమే ఈరోజు నష్టాలకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనుండటం, ఫెడ్ సమావేశం నేపథ్యంలోనూ మదుపర్లు అప్రమత్తత వహించారు.
సెన్సెక్స్ ఉదయం 70,020.68 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. చివరకు 377.50 పాయింట్లు నష్టపోయి 69,551.03 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 21,018.55 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టి చివరకు 90.70 పాయింట్లు కుంగి 20,906.40 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.38 వద్ద నిలిచింది.
సెన్సెక్స్-30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభపడ్డాయి. సన్‌ఫార్మా, మారుతీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టైటన్, రిలయన్స్, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.