Swiggy IPO Share Price: ఇవాళ దాదాపు 5000 మంది ఉద్యోగులను కోటీశ్వరులను చేయనున్న స్విగ్గీ ఐపీఓ?

Swiggy IPO Share Price: స్టాక్ మార్కెట్లో గతవారమే స్విగ్గి ఐపిఓకు వచ్చింది. ట్రెడ్ వర్గాల్లో భారీ ప్రచారం, బజ్ సృష్టించిన ఈ ఐపీఓ లాంచింగ్ తరువాత ఇవాళే స్విగ్గి షేర్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవనున్నాయి.

Update: 2024-11-13 07:34 GMT

Swiggy IPO Share Price

Swiggy IPO Share Price live updates: స్టాక్ మార్కెట్లో గతవారమే స్విగ్గి ఐపిఓకు వచ్చింది. ట్రెడ్ వర్గాల్లో భారీ ప్రచారం, బజ్ సృష్టించిన ఈ ఐపీఓ లాంచింగ్ తరువాత ఇవాళే స్విగ్గి షేర్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవనున్నాయి. అయితే, ఇవాళ్టి స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌తో దాదాపు 5000 మంది స్విగ్గి ఉద్యోగులు నేటితో కోటీశ్వరులు కానున్నారని తెలుస్తోంది. మనీ కంట్రోల్.కామ్ వెల్లడించిన వార్తా కథనాల ప్రకారం స్విగ్గీ మొగ్గ దశలో ఉన్నప్పటి నుండి ఐపీఓకు వెళ్లే వరకు కంపెనీ ఉన్నతి కోసం కృషిచేసిన వారికి షేర్స్ కేటాయింపుల్లో ఎక్కువ ప్రాధాన్యం కల్పిస్తోంది. అందులో భాగంగానే రూ.9000 కోట్ల షేర్స్ కంపెనీ ఉద్యోగులకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. దీనిని ఎంప్లాయిస్ స్టాక్ ఆప్షన్ (ESOP) అంటారు.

భారత్‌లో స్టార్టప్ ఈకోసిస్టంలో తమ ఉద్యోగులకు ఇంత భారీ స్థాయిలో ఎంప్లాయిస్ స్టాక్ ఆప్షన్ ఇచ్చిన అతి కొన్ని కంపెనీల జాబితాలో స్విగ్గీ కూడా చేరిపోయింది. హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం గతంలో ఫ్లిప్ కార్ట్ కూడా తమ ఉద్యోగులు, మాజీ ఉద్యోగులకు కలిపి మొత్తం రూ. 11,600 కోట్ల నుండి 12,500 కోట్ల రూపాయల విలువైన షేర్స్ కేటాయించింది. స్టార్టప్ కంపెనీల జాబితాలో ఇదే అతి పెద్ద ఎంప్లాయిస్ స్టాక్ ఆప్షన్ గా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడా ఇలా ఐపీఓ ద్వారా తమ ఉద్యోగులను కోటీశ్వరులుగా మార్చిన స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు స్విగ్గీ కూడా అదే బాటలో ప్రయాణిస్తోంది.

రూ. 11,327 కోట్ల లక్ష్యంతో ఐపీఓకు వెళ్లిన స్విగ్గీకి భారీ స్పందన కనిపించింది. ఈ ఏడాది భారీ లక్ష్యంతో ఐపీఓకు వెళ్లిన కంపెనీలలో హ్యూందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ 3.3 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా ఆ తరువాతి స్థానంలో స్విగ్గీనే ఉంది. ఫుడ్ డెలివరి రంగంలో టెక్నాలజీ వినియోగం, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అప్పుల చెల్లింపులు, వ్యాపార వృద్ధి వంటి అవసరాల కోసం ఈ పెట్టుబడులను వినియోగించనున్నట్లు స్విగ్గీ స్పష్టంచేసింది.

ఇన్వెస్టర్స్‌ని వెంటాడుతున్న భయం

ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం ప్రస్తుతం స్విగ్గీ నష్టాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఈ నష్టాలు పూడ్చుకోవడానికి కంపెనీకి మరో 2-3 ఏళ్లయినా పట్టే అవకాశం ఉందని ఆ వార్తా కథనం స్పష్టంచేసింది. ఓవైపు స్విగ్గీ ఐపీఓ తమ పంట పండిస్తుందనే ఆశ పెట్టుబడిదారులను ఊరిస్తున్న్పటికీ.. ఈ నష్టాలు ఇలాగే కొనసాగితే తమ పెట్టుబడి ఏమై పోతుందో అనే భయం కూడా వారిని వెంటాడుతున్నట్లు ఆ కథనం పేర్కొంది. గ్రో యాప్‌లో చూపించిన డేటా ప్రకారం గతేడాది జూన్ త్రైమాసికంలో రూ. 564 కోట్ల నష్టం చవిచూసిన స్విగ్గీ కంపెనీ ఈ ఏడాది అదే జూన్ త్రైమాసికం నాటికి రూ. 611 కోట్ల నష్టాన్ని చూపించింది.

ఇన్వెస్టర్లను హడలెత్తించిన షేర్ ధర

ఏ కంపెనీ అయినా ఐపీఓకు వస్తుందంటే.. ఆ కంపెనీ షేర్ల లిస్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుందనే ఉత్కంఠ మార్కెట్ వర్గాల్లో కనిపిస్తుంటుంది. స్విగ్గీ ఐపీఓ విషయంలో కూడా అదే జరుగుతోంది. గ్రో యాప్ ద్వారా స్విగ్గీ షేర్ వ్యాల్యూని పరిశీలించినప్పుడు ఇవాళ ఉదయం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఆరంభంలో రూ. 420 వద్ద మొదలైన షేర్ ధర ఆ తరువాత తొలి అరగంటలోనే రూ. 391 దిగువకు పడిపోయింది. మళ్లీ ఉదయం 10 గంటల నుండి క్రమక్రమంగా పెరగడం మొదలైన షేర్ ధర 11:40 గంటల సమయానికి గరిష్టానికి చేరుకుని రూ. 449 వద్ద ట్రేడ్ అవడం కనిపించింది. 

Tags:    

Similar News