దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా పదో రోజు లాభాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 260 పాయింట్లకు పైగా లాభాలను నమోదు చేయగా నిఫ్టీ 14,200 పాయింట్లకు చేరువన స్థిరపడింది. తాజా సెషన్ లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపిన నేపధ్యంలో సూచీలు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 200 పాయింట్ల మేర క్షీణించగా నిఫ్టీ సైతం 41 పాయింట్లు కోల్పోయాయి. అయితే ఆ తర్వాత మార్కెట్లు రీ-బౌండ్ కావడంతో సానుకూల బాటన పయనిస్తూ లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 260 పాయింట్లు ఎగసి 48,437 వద్దకు చేరగా నిఫ్టీ 66 పాయింట్ల మేర లాభంతో 14,199 వద్ద స్థిరపడ్డాయి.