Stock Market: సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసిన సూచీలు
Stock Market: 733 పాయింట్ల మేర లాభపడిన నిఫ్టీ
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో దలాల్ స్ట్రీట్‌లో బుల్ రంకెలేసింది. దీనికి జీడీపీ గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు తోడవ్వడం మరింత బూస్ట్ ఇచ్చింది. దీంతో ఆరంభం నుంచి మార్కెట్లు ముగిసేవరకు అదే దూకుడు కొనసాగింది. సూచీల లాభాల పరుగుకు రికార్డులు బద్ధలయ్యాయి. మునుపెన్నడూ చూడని సరికొత్త గరిష్ఠాలను సూచీలు నమోదు చేశాయి. సెన్సెక్స్ తొలిసారి 76 వేల 400 మార్కును అందుకోగా.. నిఫ్టీ సైతం 23 వేల 200 ఎగువన ముగిసింది. మదుపరుల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ 12.50 లక్షల కోట్ల మేర పెరిగింది.
సెన్సెక్స్ ఉదయం 76 వేల 583 పాయింట్ల వద్ద భారీ లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలోనే దాదాపు 27 వందల పాయింట్లు లాభంతో ప్రారంభమవడంతో ఈ ఉత్సాహం కాసేపే అనుకున్నారు. కానీ ఎక్కడా తగ్గేదేలా అన్నట్లుగా దూకుడు సాగింది. ఇంట్రాడేలో 76 వేల 738 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 2 వేల 507 పాయింట్ల లాభంతో 76 వేల 468 వద్ద ముగిసింది. నిఫ్టీ 733 పాయింట్ల లాభంతో 24 వేల 263 వద్ద స్థిరపడింది.