Gold Price: దూసుకుపోతున్న బంగారం ధర.. రూ.63వేలకు చేరువలో పసిడి ధర
Gold Price: కస్టమర్లకి అందని ద్రాక్షలా ఊరిస్తున్న బంగారం ధరలు
Gold Price: పసిడి ధర కొండెక్కడంతో సెంటిమెంట్‌కు ఆయింట్‌మెంట్ పూసే ఆయుధం ఏది కానుంది.? జీవితకాల గరిష్టానికి చేరుకున్న బంగారం రేపటి భవిష్యత్‌ను ఎలా శాసించబోతుంది? ఈ ప్రశ్నలకు బులియన్ మార్గెట్ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇపుడు బంగారం కొనడమంటే గగనమే.. పది గ్రాముల స్టాండర్ట్ బంగారం 63 వేల రూపాయలు పలుకుతోంది. అటు వెండి కూడా బంగారం దారిలోనే పయనిస్తోంది.
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఊపందుకోవడంతో మార్కెట్లో కిలో వెండి ధర 76వేల 800 రూపాయలు పలుకుతుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణత, ఆర్థిక మాంద్యం ఆందోళనలతో బంగారంలో పెట్టుబడులు పెట్టడమే బెటరని మదుపర్లు భావిస్తున్నారు. దీనికి తోడు దేశీయంగా కూడా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయ్.
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయ్. ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో పుత్తడి ధరలు 63వేల రూపాయల మార్కును తాకాయి. దీంతో బంగారం మాట మాట్లాడాలంటేనే మధ్యతరగతి కుటుంబం జంకుతోంది. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64 వేల రూపాయలకు చేరుకుంది. ఇక పసిడి ధరతో పాటు వెండి ధరలు కూడా ఆకాశానంటాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర వొత్తిళ్లకు లోను కావడం, బంగారాన్ని ఎక్కువ మంది పెట్టుబడిగానే భావిస్తుండటం, డాలర్ మారక విలువ ఇలా ఎన్నో అంశాలు బంగారం ధరల్లో పెరుగుదలకు కారణమవుతున్నాయి.
ఏమైనా బంగారం ధర అంతర్జాతీయ బులియన్ మార్కెట్ రేట్లకు అనుగుణంగా పెరుగుతూ కస్టమర్లకి అందని ద్రాక్షలా ఊరిస్తోంది. దీపావళి నాటికి ఈ ధరలు మరింత ఆకాశానికేసి చూస్తాయేమోనన్న అనుమానం ఇటు మదుపర్లని, అటు వినియోగదారులను వెంటాడుతున్నాయ్. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోలేని వాళ్లు దీపావళికి కొనుక్కోవచ్చన్న నానుడి... బంగారం విషయం నిజం కాదేమోనన్న సందేహమూ ఉంది.