Rice Price: గోధుమల తర్వాత ఇప్పుడు బియ్యం ధరలు కూడా హైక్..!
Rice Price: గోధుమల తర్వాత ఇప్పుడు బియ్యం ధరలు కూడా హైక్..!
Rice Price: దేశ ప్రజలు నిరంతరం ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌ని అనుభవిస్తున్నారు. ఇప్పుడు గోధుమల తర్వాత బియ్యం ధరలు కూడా పెరగబోతున్నాయి. దీని ఆల్ ఇండియా సగటు రిటైల్ ధర గతేడాది ఇదే కాలంతో పోలిస్తే కిలోకు 6.31 శాతం పెరిగి రూ.37.7కి చేరుకుంది. బియ్యం ధరల పెరుగుదలకు కారణాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుత ఖరీప్ సీజన్‌లో వరి నాట్లు 8.25 శాతం తగ్గిన నేపథ్యంలో దేశంలో ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందనే వార్తల కారణంగా బియ్యం రిటైల్ ధర పెరిగింది.
గత వారం వరకు 2022-23 ఖరీఫ్ సీజన్‌లో (జూలై-జూన్) వరి విస్తీర్ణం పరిగణనలోకి తీసుకుంటే దేశం మొత్తం బియ్యం ఉత్పత్తి లక్ష్యం 112 మిలియన్ టన్నులకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఆగస్టు 18 వరకు 343.70 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగైంది. గత ఏడాది ఇదే కాలంలో 374.63 లక్షల హెక్టార్లలో వరి సాగైంది.
రుతుపవనాల కొరత కారణంగా జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది. వరి ప్రధాన ఖరీఫ్ పంట. జూన్‌లో నైరుతి రుతుపవనాల ప్రారంభంతో విత్తడం ప్రారంభమవుతుంది. దేశం మొత్తం వరి ఉత్పత్తిలో దాదాపు 80 శాతం ఖరీఫ్ సీజన్ నుంచే లభిస్తుంది. ఇదిలా ఉంటే..గత ఏడాది ఇదే కాలంలో కిలోకు రూ.25.41గా ఉన్న గోధుమల సగటు రిటైల్ ధర ఆగస్టు 22న కిలోకు రూ.31.04కి దాదాపు 22 శాతం పెరిగింది. గోధుమ పిండి సగటు రిటైల్ ధర గతేడాది ఇదే కాలంలో కిలో రూ.30.04 నుంచి రూ.35.17కి పెరిగిందని గణాంకాలు సూచిస్తున్నాయి.