Credit Card: క్రెడిట్ కార్డు కొత్త నిబంధనలు.. ఆ విషయంలో బ్యాంకులు నిరాకరిస్తే జరిమానా చెల్లించాల్సిందే..!
Credit Card: క్రెడిట్ కార్డు కొత్త నిబంధనలు.. ఆ విషయంలో బ్యాంకులు నిరాకరిస్తే జరిమానా చెల్లించాల్సిందే..!
Credit Card: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులు, కంపెనీలకి క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లను జారీ చేయడానికి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలన్నీ జూలై 1, 2022 నుంచి అమలు అవుతాయి. అన్ని ప్రభుత్వ రంగ జాతీయ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు (NBFCలు) RBI చేసిన ఈ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. అయితే ఈ కొత్త మార్గదర్శకాలు రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకి వర్తించవు.
కస్టమర్లకు పెద్ద ఉపశమనం
ఈ కొత్త మార్గదర్శకాల ద్వారా కస్టమర్లకు ఉపశమనం కలిగించేందుకు ఆర్బీఐ ప్రయత్నించింది. గత కొన్ని సంవత్సరాలుగా క్రెడిట్, డెబిట్ కార్డులను జారీ చేసిన తర్వాత కంపెనీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని చాలా కేసులు వచ్చాయి. ఇప్పుడు వీటిని అరికట్టేందుకు ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లను క్లోజ్ చేయడంలో కంపెనీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చాలా కస్టమర్‌లు ఫిర్యాదు చేశారు. కార్డును క్లోజ్ చేయడంలో జాప్యం కారణంగా వినియోగదారులు కొన్నిసార్లు భారీ జరిమానాలు చెల్లించవలసి ఉంటుంది. ఈ పరిస్థితిలో RBI కస్టమర్ అభ్యర్థనపై క్రెడిట్, డెబిట్ కార్డులను 7 రోజుల్లోగా మూసివేయడాన్ని తప్పనిసరి చేసింది. అలా చేయని పక్షంలో రోజుకు రూ.500 జరిమానా విధిస్తారు.
RBI కొత్త మార్గదర్శకాల ప్రకారం కార్డ్ హోల్డర్ అన్ని బిల్లులను చెల్లిస్తే కస్టమర్ అభ్యర్థన మేరకు కంపెనీ లేదా బ్యాంక్ 7 రోజులలోపు కార్డును క్లోజ్ చేయాలి. అలా చేయని పక్షంలో 7 రోజుల తర్వాత బ్యాంకు ఖాతాదారునికి రోజుకు రూ.500 జరిమానా చెల్లించాలి. దీంతో పాటుగా బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల క్లోజ్ గురించిన సమాచారాన్ని కస్టమర్‌కు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడి ద్వారా సమాచారం అందించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి సంవత్సరం పాటు నిరంతరం క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించకపోతే బ్యాంక్ అతని కార్డును క్లోజ్ చేయవచ్చని RBI తెలిపింది. కానీ అలా చేసే ముందు బ్యాంకు ఖాతాదారుడికి సమాచారం అందించాలి. మెసేజ్ పంపిన 30 రోజులలోపు కస్టమర్ స్పందించకుంటే కార్డ్‌ని ఉపయోగించకుంటే బ్యాంక్ కస్టమర్ క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయాలి.