RBI: వడ్డీరేట్లలో మార్పులేదు.. ఆర్బీఐ కీలక నిర్ణయం..
RBI: రెపో రేటు యథాతథం
RBI: వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎంఎస్‌ఎఫ్, బ్యాంక్ రేట్ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణను కొనసాగించాలని పరపతి కమిటీ నిర్ణయించినట్లు శక్తికాంత దాస్ తెలిపారు.
ద్రవ్యోల్బణ తీరుతెన్నులపై నిశిత, నిరంతర నిఘా కచ్చితంగా అవసరమని అభిప్రాయపడ్డారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించే అవకాశం ఉందని అంచనా వేశారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఎంపీసీ ఎప్పటికప్పుడు కావాల్సిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దేశీయంగా పుంజుకుంటున్న గిరాకీ వృద్ధికి ఊతమిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ గిరాకీ క్రమంగా పుంజుకుంటోందన్నారు. 595.1 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఖజానాలో ఉన్నాయని వెల్లడించారు.