RBI: వినియోగదారులు అలర్ట్.. లోన్స్ విషయంలో ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు..!
RBI: దేశంలో వినియోగదారులకు నిమిషాల వ్యవధిలోనే లోన్స్ అందించే యాప్‌లు పెరిగిపోయాయి...
RBI: దేశంలో వినియోగదారులకు నిమిషాల వ్యవధిలోనే లోన్స్ అందించే యాప్‌లు పెరిగిపోయాయి. ఇవి తొందరగా లోన్స్ మంజూరు చేస్తాయి. కానీ అధిక వడ్డీలతో జనాలని పీడిస్తాయి. దీంతో వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి అవసరానికి మించి చెల్లించాల్సి వస్తుంది. అంతేగాక చెల్లించలేని పక్షంలో ఆత్మహత్యలకి పాల్పడిన సంఘటనలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో వినియోగదారుల వైపు నుంచి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి.
దీంతో ఆర్బీఐ సమస్యని పరిష్కరించడానికి భారీ సన్నాహాలు మొదలుపెట్టింది. అటువంటి యాప్‌లను, అవి మంజూరు చేసే లోన్ల కోసం ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలని అమలు చేయనుంది. ద్రవ్య విధాన కమిటీ సమావేశం అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. డిజిటల్ రుణాలకు సంబంధించిన మార్గదర్శకాలను రానున్న రెండు నెలల్లో విడుదల చేస్తామని తెలిపారు. దీనివల్ల ఇష్టారీతిన లోన్లు మంజూరు చేసే చిన్న యాప్‌లకి తెరపడినట్లవుతుంది. ఇప్పటికే డిజిటల్ రుణాలపై ప్రవేశపెట్టే నిబంధనల పని పూర్తయిందని తెలిపారు. దీనిపై అంతర్గతంగా చర్చించిన తర్వాత త్వరలోనే మార్గదర్శకాలు వెలువడుతాయని తెలిపారు.
ఆర్‌బిఐ ప్రకారం.. ధృవీకరించబడిన ఫిన్‌టెక్ కంపెనీలను మాత్రమే రుణాలు ఇవ్వడానికి అనుమతించాలి. దీంతో వినియోగదారులపై కంపెనీ ఇష్టారాజ్యం ఉండదు. అందువల్ల ఆర్‌బిఐ ఈ కొత్త పాలసీ పరిధిలోకి అన్ని ఫిన్‌టెక్ కంపెనీలను తీసుకురావాలని భావిస్తోంది. RBI ఈ కొత్త పాలసీని ప్రవేశపెట్టిన తర్వాత రుణాలు ఇస్తామని ఎటువంటి యాప్‌లు ముందుకు రావు. ఇది మాత్రమే కాదు ఈ మార్గదర్శకాలు UNI, క్యాపిటల్ ఫ్లోట్, స్లైస్, ZestMoney, Paytm వంటి BharatPe, BNPL దిగ్గజాలకు కూడా వర్తిస్తాయి.