Post Office: మీ డబ్బుకు భద్రతతో పాటు మంచి రిటర్న్స్.. అదిరిపోయే స్కీమ్..!
జాతీయ పొదుపు నెలసరి ఆదాయ ఖాతాగా పిలిచే ఈ పథకంలో డిపాజిట్ రూపంలో ఒకసారి పెట్టుబడి పెడితే సరిపోతుంది, ప్రతీ నెల స్థిరమైన ఆదాయం పొందొచ్చు.
Post Office: ప్రస్తుతం భవిష్యత్తు అవసరాలు మారుతున్నాయి, ఆర్థిక పరిస్థితులు కూడా ఎప్పుడూ ఒకేలా ఉంటాయన్న నమ్మకం తగ్గుతోంది. ఆర్థిక మాంద్యం భయాలు, ఉద్యోగాల కోతలు ఇలా రకరకాల టెన్షన్స్ ఆందోళనపెడుతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలోనే చాలా మంది డబ్బును పొదుపు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఖర్చులు పోనూ మిగిలినది పొదుపు చేయడం కాదు, పొదుపు చేసిన తర్వాత మిగిలినదాన్నే ఖర్చు చేసే రోజులు వచ్చాయి.
దీంతో పెట్టుబడి పెట్టేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. మన డబ్బుకు భద్రతతో పాటు మంచి రిటర్న్స్ రావాలనే ఆలోచన చాలా మందిలో పెరుగుతోంది. ఇలాటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ రకరకాల పథకాలను అమలు చేస్తోంది. ఇలాంటి వాటిలో మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ బెస్ట్ స్కీమ్‌గా చెప్పొచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా నెలకు రూ. 5వేలు పొందే అవకాశం ఉంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
జాతీయ పొదుపు నెలసరి ఆదాయ ఖాతాగా పిలిచే ఈ పథకంలో డిపాజిట్ రూపంలో ఒకసారి పెట్టుబడి పెడితే సరిపోతుంది, ప్రతీ నెల స్థిరమైన ఆదాయం పొందొచ్చు. ఈ పథకంలో ఒకరి పేరిట గరిష్టంగా రూ. 4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. వీటిల్లో పెట్టుబడి పెట్టిన వారికి ఐదేళ్ల వరకు నెలవారీ వడ్డీ చెల్లింపు చేస్తారు. రూ.1,500 మొత్తాల్లో పెట్టుబడి పెట్టే వీలుంటుంది. ప్రస్తుతం నెలవారీ వడ్డీ 7.3 శాతం వరకు చెల్లిస్తున్నారు. ఇందులో కనిష్టంగా రూ. వెయ్యి నుంచి గరిష్టంగా రూ. 4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.
ఒకవేళ జాయింట్ అకౌంట్ అయితే రూ. 9 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్‌లో గరిష్టంగా ముగ్గురు ఉండొచ్చు. స్కీమ్ మెచ్చూరిటీ కాలం ఐదేళ్లుగా ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత నెలవారీ వడ్డీతో కలిపి రాబడి వస్తుంది. అయితే నెలవారీ పొందాలనుకునే వారికి నెలకు గరిష్టంగా రూ. 5,500 వరకు పొందొచ్చు. ఉమ్మడి ఖాతా ఉన్నవారికైతే రూ.9,250 పొందుతారు.
ఈ ఖాతా ఓపెన్ చేసిన తర్వాత ఏడాదికి 7.4 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఖాతా తెరిచిన ఒక నెల తర్వాత మెచ్యూరిటీ వరకు వడ్డీ చెల్లింపు ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లు ఉంటుంది. అయితే మెచ్యూరిటీ తేదీకి ముందే ఖాతాదారు మరణిస్తే ఆ ఖాతాను మూసివేస్తారు. అప్పటివరకు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని నామినీ లేదా వారి వారసులకు చెల్లిస్తారు.