LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవోలో చేరాలంటే ఏం చేయాలి.. ఏ పత్రాలు కావాలి..?
LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవోలో చేరాలంటే ఏం చేయాలి.. ఏ పత్రాలు కావాలి..?
LIC IPO: దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) త్వరలో మార్కెట్‌లోకి ఐపీవోని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దాదాపు ఈ సంవత్సరం మార్చి నాటికి ఐపీవో షేర్ మార్కెట్‌లోకి వచ్చేస్తుంది. ప్రభుత్వం వచ్చే వారంలోగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి (SEBI) ఎల్‌ఐసీ ఐపీవో కోసం ముసాయిదా పత్రాలను దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే పాలసీ దారులు ఇందులో పాల్గొనాలంటే ఏం చేయాలి.. ఏ పత్రాలు కావల్సి ఉంటుందో వివరంగా తెలుసుకుందాం.
ఎల్‌ఐసీ ఐపీవోలో 10 శాతం వరకు పాలసీదారులకు కేటాయిస్తారని చెబుతున్నారు. ఎల్‌ఐసీ పాలసీ దారులు ఐపీవోలో పాల్గొనాలనుకుంటే రెండు విషయాలు తప్పనిసరి. ఒకటి ఎల్‌ఐసీ పాలసీ ఖాతాలో తప్పనిసరిగా పాన్ నంబర్ (PAN) ఉండాలి. రెండోది మీకు తప్పనిసరిగా డీమ్యాట్ ఖాతా ఉండాలి. అందుకే ఎల్‌ఐసీ పాలసీదారులను పాన్‌కార్డ్‌ని అప్‌డేట్ చేయమని కోరింది. దీంతో వారు పబ్లిక్ ఆఫర్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అంతేకాదు పాన్ వివరాలు కార్పొరేషన్ రికార్డులలో కూడా అప్‌డేట్ అయి ఉండాలి.
దీంతో పాటు చెల్లుబాటు అయ్యే డీమ్యాట్ ఖాతా ఉంటేనే భారతదేశంలో ఏదైనా పబ్లిక్ ఆఫర్‌కు సబ్‌స్క్రిప్షన్ సాధ్యమవుతుందని ఎల్‌ఐసీ తెలిపింది. ఈక్విటీ మార్కెట్లలో షేర్లను కొనడానికి విక్రయించడానికి డీమ్యాట్ తప్పనిసరి. ఈ ఖాతాలు NSDL, CDSL వంటి డిపాజిటరీ సంస్థలు నిర్వహిస్తాయి. ఆధార్, పాన్ వివరాలు, చిరునామా రుజువు వంటి పత్రాలు కూడా అవసరమవుతాయి. ఎల్‌ఐసీకి 25 కోట్ల మంది పాలసీదారులు ఉండగా డీమ్యాట్ ఖాతాల సంఖ్య 8 కోట్లు మాత్రమే. దీంతో ఈ ఖాతాలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.