Onion Price: ఉల్లి ధరల జోరు.. వినియోగదారుల బేజారు!
Onion Price: ఒక్కసారిగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి. రెండు రోజుల క్రితం వరకూ 40-50 రూపాయలు ఉన్న ఉల్లి ధరలు ఇప్పుడు 80-100 వరకూ పెరిగిపోయాయి. దీంతో ఉల్లి కోయకుండానే కన్నీరు పెట్టిస్తోంది.
ఉల్లిపాయ మళ్ళీ ఘాటెక్కింది. కోయకుండానే కన్నీరు పెట్టిస్తోంది. వందకు నాలుగైదు కిలోలు వచ్చే స్థితి నుంచి కిలో వంద రూపాయలకు ఎగబాకింది. మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. మార్కెట్లో ఉల్లి దొరకడం కూడా కష్టంగానే మారింది. భారీ వర్షాలు కారణంగానే ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అంటున్నారు. అయితే, ఈ ఉల్లిధరల ఘాటుకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు.
కారణాలు ఇవే..
భారీ వర్షాల కారణంగా ఉల్లి పంట నీట మునిగిపోవడం, పొలాల్లో నీరు నిలవ ఉండడంతో ఉల్లిని ఏరడం కష్టంగా మారడంతో నెలలోనే పంట కుళ్ళిపోవడం ముఖ్యకారణం. రైతులు వేలాది ఎకరాల్లో ఉల్లిని సాగుచేసి.. పూర్తిగా నష్టపోయారు. ఇప్పుడు మార్కెట్ లో ఉల్లి సరఫరా చాలా తగ్గింది. దీంతో మార్కెట్ లో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వర్షాలు తగ్గి కొత్తపంట చేతి కొచ్చేవరకూ ఉల్లి ధరల ఘాటు తగ్గే అవకాశం లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ప్రస్తుతం ఉల్లి కేజీకి 80 నుంచి 100 రూపాయల ధర పలుకుతోంది. అయితే, ఇది 120 రూపాయల వరకూ చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రకృతి విపత్తు సమయాల్లో ఉల్లిని నిలువచేసుకునే వెసులుబాటు లేకపోవడం ఉల్లి ధరల నియంత్రణలో ప్రధాన ప్రతిబంధకంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతులు కూడా బాగా తగ్గిపోయాయి. దీంతో డిమాండ్ కు సరిపడా ఉల్లి దొరకడం లేదు. అందుకే ఉల్లి ధరలు కొండెక్కుతున్నాయని అధికారులు అంటున్నారు.
ఉత్పత్తి అధికమే.. కానీ..
నిజానికి మన దేశంలో ఉల్లి అధికంగానె ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో పంట వచ్చే సమయంలో ఒక్కసారిగా ధరలు పడిపోతాయి. దాంతో రైతులు గత్యంతరం లేక కిలో రెండు రూపాయలకు కూడా ఉల్లిని అమ్మేసుకుంటారు. ముఖ్యంగా ఉల్లిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే వెసలుబాటు మన దేశంలో ఇప్పటికీ లేదు. దీంతో పంట వచ్చినప్పుడు వెంట వెంటనే అమ్మకాలు చేసుకోవాల్సిందే. ఇదే పంట లేని సమయంలో ధరలు విపరీతంగా పెరిగిపోవడానికి కారణంగా మారుతోంది. దేశంలో 22 మిలియన్ టన్నుల ఉల్లి పంట పండిస్తున్నారు రైతులు. దీనిలో 15.5 మిలియన్ తన్నులు మాత్రమే ఇక్కడ వినియోగిస్తున్నాం. మిగిలినది చాలా వరకూ ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. మిగిలిన దేశాలతో పోలిస్తే ఉల్లి వినియోగం మన దేశంలో చాలా ఎక్కువ. దీంతో ఇప్పుడు ఉల్లి పంట దెబ్బతినడంతో అమాంతం ధరలు పెరిగిపోయాయి.
ప్రతి సంవత్సరమూ ఇలానే..
దాదాపుగా సంవత్సరంలో రెండుసార్లయినా ఉల్లి ధరలు కొండెక్కి కూచోవడం పరిపాటిగా మారిపోయింది. దేశీయంగా డిమాండ్ పెరిగి ధరలు పెరిగినపుడు వెంటనే.. ఎగుమతులు నిషేధించడం.. ఇతర దేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవడం ఇదే తాత్కాలిక పద్ధతిలో రోజులు నెట్టేస్తున్నారు. దీంతో ఈ సమస్య ఎప్పటికప్పుడు ప్రజలకు కన్నీరు పెట్టిస్తూనే ఉంటోంది. నిజానికి.. ఉల్లిధరలు ఇంతలా రేటు పెరిగినా సామాన్య రైతుకు మాత్రం ఎటువంటి లాభం ఉండదు. ఈ లాభం అంతా దళారీల చేతుల్లోకే పోతుంది. రైతులు పంట పండిన వెంటనే అయిన కాడికి ముందే చెప్పినట్టు ఒక్కోసారి రెండు రూపాయలకు కిలో కూడా అమ్మేసుకుంటారు. దీనిని అక్రమ నిల్వదారులు..దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. వారు నిల్వ చేసుకుని తరువాత ఇదిగో ఇలా అమ్ముకుంటారు. దీంతో ఇటు పండించిన రైతన్నకు ఆకలి బాధ తప్పట్లేదు.. ఇటు వినియోగదారుల జేబులకు చిల్లులు పడటమూ తప్పడం లేదు. ప్రభుత్వం శాశ్వత పరిష్కారం దిశలో ప్రయత్నాలు చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకె అవకాశం లేదు.