EPFO: ఈపీఎఫ్‌వో అలర్ట్.. ఇప్పుడు వారికి కూడా నెలవారీ పెన్షన్..!
EPFO: భారతదేశంలో అసంఘటిత రంగంలో పనిచేసేవారు చాలామంది ఉన్నారు.
EPFO: భారతదేశంలో అసంఘటిత రంగంలో పనిచేసేవారు చాలామంది ఉన్నారు. వీరు ఎటువంటి సామాజిక భద్రత ప్రయోజనాలను పొందడం లేదు. చాలా మంది పింఛన్ సౌకర్యం లేకుండా గడుపుతున్నారు. ఈ సమస్యని ఈపీఎఫ్‌వో (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) గుర్తించింది. వీరికి కూడా పెన్షన్ లభించేలా ఒక కొత్త పథకాన్ని రూపొందించింది. దీని కింద అందరిని పెన్షన్ పరిథిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
చట్టంలో మార్పులు
అసంఘటిత రంగంలోని ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులందరినీ EPFO పరిధిలోకి తీసుకురావడానికి ఉద్యోగుల భవిష్య నిధి నిబంధనల చట్టం 1952ను సవరించాల్సి ఉంటుంది. అంతేకాదు రిటైర్మెంట్ ప్రయోజనాలని పొందేందుకు వీలుగా జీతం, ఉద్యోగుల పరిమితులను తొలగించాల్సి ఉంటుంది. అప్పుడే అందరు ఈ కొత్త పథకం ప్రయోజనాన్ని పొందగలుగుతారు. EPFO నిబంధనల ప్రకారం ఒక కంపెనీ లేదా సంస్థ EPFOలో నమోదు అయి ఉండి కనీసం 20 మంది ఉద్యోగులు పనిచేయాలి.
ఈ కొత్త పథకం అమలు కోసం EPFO అన్ని వాటాదారులతో చర్చలు జరుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా సంప్రదిస్తోంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓకు 5.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పటివరకు EPFO తన ఖాతాదారులకు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమాను అందిస్తుంది. చట్టాన్ని మార్చినట్లయితే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థకు చందాదారులు పెరుగుతారు. ఇది EPFO కార్పస్‌ను కూడా పెంచుతుంది.