LPG Rate: సామాన్యులపై గుది 'బండ'
* సామాన్య ప్రజలకు షాకింగ్ న్యూస్ * సెంచరీకి చేరువైన పెట్రోల్ ధరలు * వెయ్యికి చేరువైన గ్యాస్ ధరలు
సామాన్య ప్రజలకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. పెట్రోల్ ధరలు సెంచరీకి చేరువైతే.. గ్యాస్ రేట్ వెయ్యి దగ్గరకు వచ్చేసింది. సామాన్యుడి నడ్డి విరిచేలా చమురు సంస్థలు ఎల్పీజీ సిలిండర్ ధరను ఏకంగా 50 రూపాయాలు పెంచేశాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్నాయి. దీనికి తోడు సిలిండర్ రేటు కూడా భగ్గమంటోంది. పెరిగిన ధరలు ఆదివారం అర్థరాత్రి నుంచి అమలవుతున్నాయి.
14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు ఏకంగా 50 రూపాయలు పెంచాయి. హైదరాబాద్‌లో సిలిండర్ ధర ప్రస్తుతం 821.50కు చేరుకుంది. ఒకప్పుడు 600లకు వచ్చే సిలిండర్ ధర ఇప్పుడు రూ.800 దాటడంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక ఢిల్లీలో సిలిండర్ ధర రూ.769కి చేరింది. బెంగళూరులో రూ.772, చెన్నైలో రూ.785, ముంబైలో రూ.769, రూ.కోల్‌కతాలో 795కి చేరింది.
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరను ప్రభుత్వ చమురు కంపెనీలు నిర్ణయిస్తాయి. అంతర్జాతీయ ఇంధన రేట్లు, యూఎస్ డాలర్-రూపాయి మారకపు రేట్లపై ఆధారపడి, ధరలు పెరగవచ్చు.. తగ్గవచ్చు.. కానీ ఈసారి ఏకంగా 50 రూపాయాలు పెరగడంతో సామాన్య జనాలపై గుదిబండ పడినట్లయ్యింది.