Lijjat Papad: చదువురాని మహిళలు లిఖించిన సక్సెస్ స్టోరీ.. 45వేల మందికి ఉపాధి.. 82 బ్రాంచీలు..
Lijjat Papad: విత్తనం నాటగానే మొక్క మొలవదు. విత్తనం నాటగానే చెట్టు ఎదగదు.
Lijjat Papad: విత్తనం నాటగానే మొక్క మొలవదు. విత్తనం నాటగానే చెట్టు ఎదగదు. విత్తనం నాటగానే పూత పూయదు.. కాత కాయదు. దానికంటూ టైమింగ్ కావాలి. ఆ టైమ్ వచ్చేదాకా ఓపిక పట్టాలి. ఈ ఓపిక అనే మూడక్షరాల శబ్దమే.. చరిత్రను తిరగరాస్తుంది. పాత చరిత్రను చెరిపేస్తుంది.. కొత్త రికార్డులు సృష్టిస్తుంది. భారతీయ సాధారణ గృహిణులు చెమటోడ్చి లిఖించిన దశాబ్దాల చరిత్రే లిజ్జత్ పాపడ్.
చరిత్ర సృష్టించడానికి పాపులారిటీ ఉన్నవాళ్లే కానక్కర్లేదు. ఆడవాళ్లు ప్రతిరోజూ వాడే అప్పడాల కర్ర కూడా చరిత్ర సృష్టిస్తుంది. అవును మీరు విన్నది నిజమే. భారతీయ సగటు మహిళల చేతిలో లయబద్ధంగా నాట్యం చేసే అప్పడాల కర్ర తనకంటూ ఓ చరిత్రను సృష్టించుకుంది. అది లిజ్జత్ పాపడ్ రూపంలో అప్పడాలను సృష్టించి భారతీయ భోజన ప్రియుల చేత శెభాష్ అని కీర్తించేలా చేసింది. అంతర్జాతీయంగానూ ఫ్యాన్స్ ను సృష్టించుకుంది. ఇదంతా చేసింది ఎవరనుకుంటున్నారు. చదువు-సంధ్యలతో సంబంధం లేని సాధారణ భారతీయ మహిళలే.
అప్పడం అనేది ప్రధాన భోజనం కాదు. దాంతో కడుపు కూడా నిండదు. కానీ అది లేకపోతే భోజనానికి సంపూర్ణత్వం చేకూరదు. భోజన ప్రియుల సంతృప్తిని పరిపూర్ణం చేసేందుకు వీలైతే దాన్ని రెట్టింపు చేసేందుకే భోజనంలో అప్పడాలను యాడ్ చేస్తారు. ఏ శుభ కార్యమైనా అప్పడం లేకపోతే అసలు మజానే లేదంటారు. ఇంకే పదార్థం ఉన్నా లేకపోయినా భోజనంలో అప్పడం తీసుకొచ్చే ఫ్లేవరే వేరు. అతిథులకు సంతృప్తినిచ్చే భోజనానికి ఒక ఊరూపేరూ లేని అప్పడాలే అంతటి ప్రాచుర్యం తీసుకొస్తే.. అదే అప్పడాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది లిజ్జత్ పాపడ్.
లిజ్జత్ పాపడ్.. భారతీయ గృహిణుల ఇజ్జత్ ను రెట్టింపు చేసింది. దేశంలో విజయవంతమైన అరుదైన మహిళా సహకార సంఘంగా రికార్డు సృష్టించడమే గాక అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకుంది. 1959లో కేవలం 80 రూపాయల పెట్టుబడితో ఏడుగురు మహిళలు తలపెట్టిన మహాయజ్ఞం ఇప్పుడు నేరుగా 45 వేల మందికి పైగా మహిళలను భాగస్వాములుగా చేసుకుంది. దాదాపు లక్ష మందికి ఇండైరెక్టుగా ఉపాధినిస్తోంది.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో ఆర్థిక స్వావలంబన కోసం ఏం చేద్దామని ఆర్థిక నిపుణులంతా యోచిస్తుండగా ఇక్కడ ముంబైలో కొందరు గుజరాతీ మహిళలు ఒక డాబా మీద పెట్టుకున్న ముచ్చట్లే లిజ్జత్ అప్పడాలకు రూపకల్పన చేశాయి. అప్పడాలను ఇళ్లలో ఎవరికి వారు చేసుకునే ఆనాటి రోజుల్లో వాటిని మార్కెటింగ్ చేయాలనే ఆలోచన రావడమే ఓ అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది 1959 నాటి బ్లాక్ అండ్ వైట్ కాలం.
లిజ్జత్ పాపడ్ కు అపురూపమైన చరిత్ర రావడం వెనుక ఏడుగురు 1950ల నాటి ఏడుగురు మహిళల కృషి ఉంది. కుటుంబ ఖర్చులు పెరిగిపోయి.. పురుషులు సంపాదించే సొమ్ము ఏటూ చాలక ముంబైలోని సగటు కుటుంబాలు అల్లాడుతున్న కాలమది. సాధారణ కుటుంబాల్లో పురుషుల చదువే కనాకష్టంగా ఉన్న ఆ కాలంలో ఇక మహిళల చదువు కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునేది ఎవరు? అలాంటి పరిస్థితుల్లో ముంబైలోని ఓ ఇంటి డాబా మీద మధ్యాహ్నం ఏడుగురు మహిళలు కలిశారు. కుటుంబాల్లోని సాధక బాధకాలను చర్చించుకున్నారు. ఇంటి యజమానుల సంపాదనకు తమ వంతు కూడా తోడైతే బాగుంటుందని అందుకోసం ఏం చేస్తే బాగుంటుందని చర్చించుకున్నారు. అలా వారి ఆలోచనల్లోంచి వచ్చిందే ఈ అప్పడం. ఆనాడు ముచ్చటించుకున్న ఆ ఏడుగురు గుజరాతీ మహిళలే.. జశ్వంతీబెన్ జమ్నాదాస్, పార్వతీబెన్ రాందాస్, ఉజంబెన్ నారాణ్దాస్ కుండాలియా, బానూబెన్ ఎన్ తన్నా, లాగూబెన్ అమృత్లాల్ గోకాని, జయాబెన్ వి. విఠలాని, దివాలీబెన్ లుక్కా. ఒక పక్కా పేరంటూ లేకుండా వారు మొదలుపెట్టిన అప్పడాల తయారీనే ఆ తరువాతి కాలంలో లిజ్జత్ పాపడ్ గా మారింది. అంతర్జాతీయంగా తనకంటూ ఒక బ్రాండ్ ను సృష్టించుకుంది. లిజ్జత్ అంటే గుజరాతీలో రుచికరమైన అని అర్థం.
ఆ సామాన్య గృహిణులు అప్పడాలు చేయడానికైతే ముందుకొచ్చారు కానీ.. అందుకు పెట్టుబడి మాత్రం వారిలో ఎవరి దగ్గరా లేదు. అప్పడాలు చేయాలంటే పిండి కావాలి. ఇతర సరుకులు కావాలి. ముఖ్యంగా అప్పడాల కర్రలు, పీటలు కావాలి. కాస్త పెద్దమొత్తంలో కొనేంత పెట్టుబడి లేకుండా ముందుకెళ్లడం కష్టం. మరి ఆ డబ్బెలా సేకరించాలీ అన్న ప్రశ్న వారిని వేధించింది. అంతా కూడబలుక్కొని.. ఓ సోషల్ వర్కర్ దగ్గర 80 రూపాయల అప్పు చేశారు. ఆ 80 రూపాయల అప్పుతో పిండితో పాటు కావాల్సిన ఇతర సరుకులు కొనుగోలు చేశారు. వర్క్ స్టార్ట్ చేశారు. వారంతా కలిసి తొలుత పని షురూ చేసిన రోజు మార్చి 3వ తేదీ 1959. 64 ఏళ్ల క్రితం అన్నమాట. 80 రూపాయల మూల ధనంతో మొదలైన లిజ్జత్ పాపడ్.. తొలిరోజు 4 ప్యాకెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కానీ మన మహిళలు పట్టు పడితే వదలరు కదా. వారి పట్టుదల కారణంగా ఏడాది తిరిగేసరికి 6 వేల బిజినెస్ చేశారు. ఆ రోజుల్లో ఆరు వేలంటే.. 60 కోట్లతో సమానం. ఇలా దాని ప్రస్థానం 7వ దశాబ్దం చేరుకునే నాటికి కంపెనీ బిజినెస్ 3 బిలియన్ డాలర్లకు పెరిగింది.
ఏడుగురితో మొదలైన అప్పడాల తయారీలో చుట్టుపక్కల మహిళలంతా చేరిపోయారు. తొలినాళ్లలో పురుషుల సంపాదనకు చేదోడువాదోడుగా కనిపించిన అప్పడాల తయారీ ఆ తరువాతి కాలానికి కొందరు మహిళలైతే తమ భర్తల కన్నా ఎక్కువ సంపాదించేదాకా ఎదిగారు. ఎవరు ఎన్ని అప్పడాలు చేస్తే అంత సంపాదన. కాబట్టి లిమిటేషన్స్ లేవు. ఇందులో పని చేసేది అంతా మహిళలే. అప్పడాల్లో ఏ వస్తువు ఎంత కలపాలి ఎవరు దాన్ని సూపర్ వైజ్ చేయాలి అనేది అంతా ఒక లెక్క ప్రకారం నడుస్తుంది. కాబట్టి రుచిలో ఎక్కడా తేడా రాదు. అప్పడాలు డెలివరీ చేయడానికి, హెల్పర్లుగా మాత్రమే పురుషుల అవసరం వాడుకున్నారు. తయారీ నుంచి మేనేజ్ మెంట్ దాకా అంతా మహిళలే. ఇలా ఏడు దశాబ్దాల క్రితమే మహిళలంతా ఒక్కటై శ్రీలక్ష్మీ మహిళా ఉద్యోగ్ పేరిట ఒక సహకార సంఘంగా ఏర్పడి చేస్తున్న అప్పడాల తయారీ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆనాటి పేపర్లలోనూ ప్రముఖంగా ప్రచారం దక్కించుకుంది. దీంతో జాతీయ స్థాయిలో లిజ్జత్ పాపడ్ కు మంచి పేరొచ్చింది.
లిజ్జత్ పాపడ్ తయారీలో ఎవరూ బాసుల్లేరు ఎవరూ వర్కర్లు ఉండరు. అంతా కోవర్కర్లే. అలాంటి కమిట్ మెంట్ కారణంగానే రోజురోజుకూ అప్పడాల తయారీ కోసం మహిళలు క్యూ కట్టారు. ఫలితంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు 45 వేల మంది మహిళలు అప్పడాల తయారీలో నిమగ్నమై ఉన్నారు. దేశవ్యాప్తంగా 82 బ్రాంచీలు తయారయ్యాయి. చదువుతో పన్లేదు. కేవలం పనిచేసే స్కిల్ ఉంటే చాలు. మహిళలకు అప్పడాల కర్ర తిప్పడం జన్మతో వచ్చిన సహజమైన విద్య. అందులో స్కిల్ కోసం ప్రత్యేకించి వారేమైనా ట్రెయినింగ్ తీసుకోవాలా? కావాలంటే వారి దగ్గర ట్రెయినింగ్ తీసుకోవచ్చు ఎవరైనా. కాబట్టి ఆ అంశం కూడా ఈ బిజినెస్ ఎదుగుదలలో కలిసొచ్చింది. లిజ్జత్ ప్రోడక్ట్స్ సింగపూర్, అమెరికా వంటి దూర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మహిళల్లో లేబర్ ఫోర్స్ తగ్గిపోతుంది.. దానివల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఓ సందర్భంలో అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. అది 2019. కానీ అప్పటికే.. లిజ్జత్ పాపడ్.. పూర్తిగా మహిళల సహకారంతోనే ప్రపంచ ప్రఖ్యాతి సాధించడం విశేషం.
ఇది సాధించిన సక్సెస్ తో ఎంబీఏ కోర్సులో కూడా ఒక పాఠంగా దీన్ని చేర్చారంటే.. ఎంత సులభమైన వ్యాపార సూత్రం ఇందులో ఇమిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఎంత సక్సెస్ రేటు ఉందో కూడా గ్రహించవచ్చు. లిజ్జత్ పేరుతో కేవలం అప్పడాలు మాత్రమే కాదు. డిటర్జెంట్ పౌడర్, మసాలాలు, గోధుమపిండి వంటి పలు ఇతర ఉత్పత్తులు కూడా మార్కెట్లోకి వచ్చాయి. కానీ అన్నిటికన్నా పాపులారిటీ సాధించింది మాత్రం అప్పడాలే.
ఈ కంపెనీ పెట్టిన ఏడుగురు మహిళల్లో జశ్వంతీబెన్ జమ్నాదాస్ పోపట్ అనే వృద్ధురాలు రెండేళ్ల క్రితం మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 65 ఏళ్ల క్రితం తనలాంటి సాధారణ గృహిణులు ఒక ఆలోచనకు వచ్చి తీసుకున్న నిర్ణయం ఇలా ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎన్నో రెట్లు ఎదిగి ఎన్నో కుటుంబాలకు జీవనోపాధినివ్వడం తనకెంతో ఆనందాన్నిస్తుందని ఆమె ఆనందాశ్రువులు రాల్చారు. ఇక కంపెనీ అధ్యక్షురాలిగా జ్యోతి నాయక్.. వినూత్నమైన పంథాలో బిజినెస్ ను విస్తరించి అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. లిజ్జత్ పాపడ్ సక్సెస్ స్టోరీ మీద సీరియళ్లు, సినిమాలు, అడ్వర్టయిజ్మెంట్స్ కూడా వచ్చాయి. ఇలా లిజ్జత్ అనేది ముంబై మహిళల స్వయం ఉపాధికి ఆలంబనగా మారి వారి ఇజ్జత్ పెంచింది. పురుషుల బాధ్యతల బరువును కూడా తగ్గించింది.