మొట్ట మొదటి 'ఎనీ టైం మనీ' (ఏటీఎం) ఎక్కడ వాడారో తెలుసా?

ATM: ఒకప్పుడు తన ఖాతా నుంచి డబ్బులు తీసుకోవాలంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి లైన్లో నించోవాల్సి వచ్చేది.

Update: 2022-01-02 07:48 GMT

మొట్ట మొదటి ‘ఎనీ టైం మనీ’ (ఏటీఎం) ఎక్కడ వాడారో తెలుసా? 

ATM: ఒకప్పుడు తన ఖాతా నుంచి డబ్బులు తీసుకోవాలంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి లైన్లో నించోవాల్సి వచ్చేది. క్రమేపీ ఏటీఎంలు రావడం, ఇవి మారుమూల గ్రామాలకు సైతం విస్తరించడంతో వీటి వినియోగం మరింత పెరిగింది. పెరిగిన వినియోగాన్ని క్యాష్ చేసుకనేందుకు బ్యాంకులు ఎప్పటికప్పుడు చార్జీలు విధిస్తూ వస్తున్నాయి. దీనిలో భాగంగా నూతన సంవత్సరంలో ఆర్బీఐ ఏటీఎం విత్‌డ్రా కొత్త రూల్స్‌ను అమలులోకి తీసుకొచ్చింది. ఉచిత ట్రాన్‌జాక్షన్స్‌ పరిధి గనుక పూర్తయితే .. 21రూ. చొప్పున ఛార్జీలు ఖాతాదారుల నుంచి వసూలు చేసేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఇదిలా ఉంచితే మొట్టమొదటి ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మెషిన్‌ అలియాస్‌ ఏటీఎం (Automated teller machine) ఎక్కడ నెలకొల్పారో మనం తెలుసుకుందాం.

1987లో హెచ్‌ఎస్‌బీసీ ముంబైలో తొలి ఏటీఎంను నెలకొల్పింది. ఆ తర్వాత పన్నెండేళ్లకు దేశవ్యాప్తంగా 1,500 ఏటీఎంలు ఏర్పాటయ్యాయి. మార్చ్‌ 31, 2021 నాటికి మన దేశంలో 1,15,605 ఆన్‌సైట్‌ ఏటీఎంలు, 97, 970 ఆఫ్‌సైట్‌ ఏటీఎంలు ఉన్నాయి. ఇదే రోజుకు మొత్తం బ్యాంకులన్నీ కలిపి 90 కోట్ల డెబిట్‌ కార్డులు కస్టమర్లకు జారీ చేశాయి. ఏటీఎంను ఎవరు రూపొందించారనే విషయంపై రకరకాల వాదనలు, థియరీలు, వివిధ దేశాల వెర్షన్‌లు వినిపిస్తుంటాయి. పేటెంట్‌ విషయంలో అమెరికా సహా పలు దేశాలు వాదులాడుకుంటాయి.

బ్రిటన్‌ ఆవిష్కరణకర్త జాన్‌ షెపెర్డ్‌ బారోన్‌ ప్రపంచంలో మొట్టమొదటి ఏటీఎంను రూపొందించిన వ్యక్తిగా పేరు సాధించారు. 1965లో నగదును అందించే స్వీయ సేవ పరికరాన్ని ఆయన ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. 1967లో నార్త్‌ లండన్‌లోని 'బార్‌క్లేస్‌ బ్యాంక్‌' ఎన్‌ఫీల్డ్‌ టౌన్‌ బ్రాంచ్‌ బయట జూన్‌ 27న మొట్టమొదటిసారి ఏటీఎంను ఏర్పాటు చేశారు. విశేషం ఏంటంటే.. ఆయన పుట్టింది భారత్‌లోనే!. 1925లో మేఘాలయాలో ఓ ఆస్పత్రిలో జన్మించారాయన. ప్రతిగా 53 ఏళ్ల తర్వాత ఎస్‌బీఐ బ్యాంక్‌ 2021 ఆగష్టులో ఆయన జన్మించిన ఆస్పత్రిలో ఏటీఎంను ఏర్పాటు చేసింది.

ఏటీఎంను వివిద దేశాల్లో పలు రకాల పేర్లతో పిలుస్తుంటారు. అమెరికాలో ఏటీఎం(ఆటోమేటిక్‌ టెల్లర్‌ మెషిన్‌), కెనడాలో ఆటోమేటెడ్‌ బ్యాంకింగ్‌ మెషిన్‌(ABM), బ్రిటిష్‌ నేలపై క్యాష్‌ పాయింట్‌, క్యాష్‌ మెషిన్‌, హోల్‌ ఇన్‌ ది వాల్‌ అని కూడా పిలుస్తుంటారు. మరికొన్ని దేశాల్లో క్యాష్‌లైన్‌, ఏనీ టైం మనీ, టైమీ మెషిన్‌, క్యాష్‌ డిస్పెన్సర్‌, క్యాష్‌ కార్నర్‌, బ్యాంకోమాట్‌ అని పిలుస్తుంటారు. ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్‌ ఆధీనంలో ఉండని వాటిని వైట్‌ లేబుల్‌ ఏటీఎంలు అని పిలుస్తారు. 2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3.5 మిలియన్ల ఏటీఎంలు ఉన్నట్లు ఏటీఎం ఇండస్ట్రీ అసోషియేషన్‌ వెల్లడించింది. అయితే క్యాష్‌లెస్‌ పేమెంట్లు పెరుగుతుండడంతో ఏటీఎంల నిర్వహణ క్రమంగా తగ్గిపోతోంది.

ఏటీఎంల కంటే ముందు 1960ల్లో కంప్యూటర్‌ లోన్‌ మెషిన్‌ అనే డివైజ్‌ జపాన్‌లో ప్రాచుర్యంలో ఉండేది. తరువాత అమల్లోకి వచ్చిన ఏటీఎంలను ఎక్కడపడితే అక్కడ నెలకొల్పడానికి అనుమతులు ఉన్నాయి. క్రూయిజ్‌ షిప్స్‌, యూఎస్‌ నేవీ షిప్స్‌ లో కూడా ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఈమధ్యకాలంలో సోలార్‌ పవర్డ్‌ ఏటీఎంలను నెలకొల్పుతున్నారు. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఏటీఎం పాకిస్థాన్‌ ఖున్‌జెరబ్‌ పాస్‌లో ఉంది. సుమారు 15వేల అడుగుల ఎత్తులోలున్న ఈ ఏటీఎం.. మైనస్‌ 40 డిగ్రీల సెల్సియస్‌లోనూ పని చేస్తుంది. సాధారణంగా ఏటీఎంలకు సెక్యూరిటీ గార్డులు, టెక్నికల్‌ సిబ్బందితో పాటు ఇతర సిబ్బందిని సైతం నియమిస్తుంటారు. శుభ్రం చేయడం, ఇతర మెయింటెనెన్స్‌ ఇందులో భాగంగా ఉండేవి. ఏటీఎంలు నెలకొల్పిన తొలినాళ్లలో ఈ తరహా ఉద్యోగాలు పెరుగుతాయని భావించారంతా. 2010 నాటికి ఆరు లక్షల మందిని ఈ తరహా ఉద్యోగాల్లో నియమించుకున్నారు. కానీ, సెక్యూరిటీ గార్డులకే ఆ పని అప్పగించడం, పైగా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వల్ల ఈ తరహా నియామకాలు తగ్గుతూ వస్తున్నాయి.

Tags:    

Similar News