ఈ ప్రభుత్వ పెన్షన్ స్కీమ్‌లో కీలక మార్పు.. వారు ఇప్పుడు అర్హులు కాదు..!
Atal Pension Scheme: భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ స్కీమ్‌లో ఇప్పుడు పెద్ద మార్పు చేశారు.
Atal Pension Scheme: భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ స్కీమ్‌లో ఇప్పుడు పెద్ద మార్పు చేశారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారుడు అటల్ పెన్షన్ స్కీమ్‌కు దరఖాస్తు చేయలేరు. అటల్ పెన్షన్ స్కీమ్ 2015లో ప్రారంభించారు. దీని కింద దరఖాస్తుదారునికి ప్రతి నెల పెన్షన్ చెల్లిస్తారు. వాస్తవానికి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రజలకు పెన్షన్‌ను అందించడానికి ఈ పథకం ప్రారంభించారు. ఆదాయపు పన్ను చెల్లించే వారు అటల్ పెన్షన్ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోలేరని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు ఒక నివేదిక పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త నిబంధన అక్టోబర్ 1, 2022 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది.
ఈ నిర్ణయానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఆగస్టు 10న విడుదలైంది. నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను చెల్లించే పౌరుడు అక్టోబర్ 1 తర్వాత అటల్ పెన్షన్ స్కీమ్‌కి అర్హుడు కాదు. అక్టోబర్ 1 తర్వాత అటల్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తే అతని ఖాతా వెంటనే మూసివేస్తారు. అంతేకాదు ఖాతాలో జమ పింఛను సొమ్ము తిరిగి చెల్లిస్తారు.
అటల్ పెన్షన్ స్కీమ్ అర్హతను గమనిస్తే భారతదేశంలోని ప్రతి పౌరుడు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారు వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తుదారు పొదుపు ఖాతాను కలిగి ఉండాలి. మొబైల్ నంబర్ కూడా కలిగి ఉండాలి. మీరు అటల్ పెన్షన్ స్కీమ్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న బ్యాంకుకు ఈ మొబైల్ నంబర్ అందించడం కచ్చితంగా అవసరమని గుర్తుంచుకోండి.
అటల్ పెన్షన్ యోజన (APY)అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం అమలు అవుతుంది. దీని కింద కనీస పెన్షన్ రూ.1,000, రూ. 2,000, రూ. 3,000, రూ. 4,000 లేదా రూ.5,000 వరకు ఇస్తారు. ఖాతాదారుడు డిపాజిట్ చేసిన డబ్బు ప్రకారం 60 సంవత్సరాల వయస్సులో పెన్షన్ అందిస్తారు. దీనిని ప్రభుత్వ ఏజెన్సీ అయిన PFRDA ద్వారా నిర్వహిస్తున్నారు.