సోమవారం భారీ నష్టాలను మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు.. ఇవాళ కాస్త కోలుకున్నాయ్. క్రితం సెషన్ భయాలతో ఉదయం హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ.. ఆ తర్వాత పుంజుకున్నాయ్. ఐటీ సహా దాదాపు అన్ని రంగాల్లో కొనుగోళ్ల అండతో లాభాల్లో స్థిరపడ్డాయ్. ఉదయం 380పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్... కాసేపటికే నష్టాల్లోకి దిగజారింది. ఇంట్రాడేలో 45వేల 162 దగ్గర కనిష్ఠ స్థాయిని తాకిన సూచీ... ఆ తర్వాత క్రమంగా లాభాల బాట పట్టింది. కొనుగోళ్ల అండతో దూసుకెళ్లింది. మార్కెట్ ముగిసే సమయానికి 453 పాయింట్లు ఎగబాకి 46వేల 6పాయింట్ల దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 138 పాయింట్లు లాభపడి 13వేల 466 దగ్గర క్లోజ్ అయింది.