Google Gemini: AI జెమిని వాడకంపై యూజర్లకు గూగుల్ కీలక సూచన
Google Gemini: గూగుల్ అడ్వాన్స్‌డ్ వెర్షన్ AI టూల్ వాడకంపై యూజర్లకు సూచన
Google Gemini: గూగుల్ సంస్థ గతేడాది చివర్లో జెమిని AI పేరుతో అత్యంత అడ్వాన్స్‌డ్ వెర్షన్ AI టూల్‌ను పరిచయం చేసింది. ఇది కచ్చితత్వంతో వేగవంతమైన ఫలితాలు ఇస్తుందని కంపెనీ తెలిపింది. అయితే... తాజాగా జెమిని AI వాడకంపై యూజర్లకు గూగుల్ కీలక సూచనలు చేసింది. ఈ AI టూల్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే క్రమంలో లేదా సమాచారం తెలుసుకునే సమయంలో వ్యక్తిగత, సున్నితమైన డేటాని షేర్ చేయొద్దని సూచించింది.
‘‘జెమిని యాప్ లేదా వెబ్‌సైట్‌లు గూగుల్ అసిస్టెంట్‌కి అత్యంత అడ్వాన్స్‌డ్ వెర్షన్. దీని ద్వారా మీరు ఏదైనా సమాచారం తెలుసుకున్న అనంతరం హిస్టరీని యూజర్ డిలీట్ చేసినా.. రివ్యూ కోసం మరికొంత కాలం గూగుల్ డేటాలో ఉంటాయి. యూజర్ తన డివైజ్‌లో జెమిని యాక్టివిటీని డిసేబుల్ చేసినా.. అప్పటి వరకు సెర్చ్ చేసిన సమాచారం వివరాలు 72 గంటలపాటు స్టోర్ అవుతాయి. కొన్నిసార్లు ఈ సమాచారం మూడేళ్లపాటు గూగుల్ స్టోరేజ్‌లో ఉంటుందని గూగుల్ జెమిని యాప్ ప్రైవసీ బ్లాగ్‌లో పేర్కొంది.
కొన్నిసార్లు యూజర్ ప్రమేయం లేకుండా జెమిని సర్వీస్ ప్రారంభమవుతుందని అందులో పేర్కొంది. ఉదాహరణకు ‘హేయ్ గూగుల్’ కమాండ్‌ను పోలిన సౌండ్ వినిపించినా.. జెమిని యాక్టివేట్ అవుతుందని బ్లాగ్‌లో వెల్లడించింది. అందుచేత యూజర్లు వ్యక్తిగత సమాచారం.. సున్నితమైన అంశాలను షేర్ చేయొద్దని గూగుల్ స్పష్టం చేసింది.