భవిష్యత్‌లో బంగారం ధరలు భారీగా పతనం కానున్నాయా ? కరోనా వేళ అంతకంతకు పెరిగిపోయిన గోల్డ్ రేట్లు వ్యాక్సిన్ రాకతో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా? శుక్రవారం నాటి ఫ్యూచర్ ట్రేడింగ్స్ ఏం చెప్తున్నాయ్ ? బంగారం ధరలపై విశ్లేషకులు ఏమంటున్నారు ?
ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయ్. అమెరికన్ ట్రెజరీ ఈల్డ్స్ పుంజుకోవడం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడటం వంటి అంశాలు దీనికి కారణంగా తెలుస్తోంది. దీంతో దేశ, విదేశీ మార్కెట్లో విలువైన లోహాల ధరలు ఉన్నట్టుండి పతనమయ్యాయ్. దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి 2వేలకు క్షీణించగా వెండి కేజీ మరింత అధికంగా 6వేలకు పైగా పడిపోయింది. న్యూయార్క్ కామెక్స్‌లోనూ ఔన్స్ పసిడి 78డాలర్లు కోల్పోయింది. వెండి అయితే ఏకంగా 10శాతం కుప్పకూలింది.
అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు కరోనా కట్టడికి వీలుగా వ్యాక్సిన్ల వినియోగాన్ని స్టార్ట్ చేశాయ్. దీంతో ఆర్థిక వ్యవస్థలు తిరిగి గాడిన పడనున్న అంచనాలు బలపడుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు మార్చి తదుపరి ట్రెజరీ ఈల్డ్స్ గరిష్టానికి చేరడంతో పసిడిని హోల్డ్ చేసే వ్యయాలు పెరగనున్నట్లు అంటున్నారు. ఎంసీఎక్స్‌లో వీకెండ్ రోజు 10గ్రాముల బంగారం 2వేల 86 క్షీణించి 48వేల 818 దగ్గర ముగియగా ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర. వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ 6వేల 112 దిగజారి 63వేల 850 దగ్గర నిలిచింది.
న్యూయార్క్ కామెక్స్‌లో శుక్రవారం పసిడి ఔన్స్ 4.1శాతం పతనమై వెయ్యి 835 డాలర్ల దగ్గర స్థిరపడింది. స్పాట్ మార్కెట్లోనూ 3.5 శాతం నష్టంతో వెయ్యి 849 డాలర్ల దగ్గర నిలిచింది. వెండి మరింత అధికంగా ఔన్స్ దాదాపు 10 శాతం పడిపోయి 24.64 డాలర్ల దగ్గర క్లోజ్ అయింది.