Gold rate: ఈ వారం కాస్త దిగొచ్చిన బంగారం ధరలు..భారీగా పడిపోయిన వెండి ధరలు! గత వారంలో ఎంత తగ్గాయంటే..
Gold Rate: వారమంతా బంగారం, వెండి ధరలు అటూ ఇటూ మారుతూ చివరికి కింది చూపులతోనే వారాన్ని ముగించాయి. వెండి మాత్రం ఒకేసారి భారీ తగ్గుదల నమోదు చేసి తరువాత కాస్త కాస్త గా పైకెగసింది.. దీంతో వారాంతానికి బంగారం ఓ మోస్తరుగా తగ్గుదల నమోదు చేయగా , వెండి ధరలు భారీ తగ్గుదలను నమోదు చేశాయి.
బంగారం భారతీయులకు ఎంతో ఇష్టమైన లోహం. బంగారు ఆభరణాలు ధరించడం.. బంగారంతో చేసిన వస్తువులను వాడటం అంటే అమితమైన ఆసక్తి మనకు. పెళ్లిళ్లలో బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత చెప్పలేనిది. వధువుకు ఎంత బంగారం పుట్టింటి వారిస్తారు.. ఎంత బంగారం అత్తింటి వారు పెడతారు వంటి లెక్కలు అన్ని పెళ్ళిళ్ళలోనూ ప్రధాన చర్చనీయాంశాలలో ఒకటిగా ఉంటుంది. ఇక బంగారం ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి మంచి మార్గంగా ఎక్కువ శాతం భావిస్తున్నారు. అటువంటి పసిడికి సంబంధించి ధరలు ఎలా ఉంటున్నాయనేది తెలుసుకోవాలనే ఆసక్తీ చాలా మందిలో ఉంటుంది. ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఎంత తగ్గింది.. ఎంత పెరిగింది చూడడం సహజం..పదుల రూపాయల్లో పెరిగినా తరిగినా పెద్దగా ప్రజలు పట్టించుకోరు. కానీ, బంగారం విషయంలో మాత్రం రూపాయి తగ్గినా..రూపాయి పెరిగినా అది పెద్ద విషయంలానే లేక్కేస్తారు.
ఇక బంగారం ధరలు, వెండి ధరలు రోజు రోజూ మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా ధరల్లో మార్పులు నిత్యం జరుగుతుంటాయి. సోమవారం నుంచి శనివారం వరకూ బంగారం మార్కెట్ ధరలు అటూ ఇటూ మారుతూ వస్తాయి. ఆదివారం ట్రేడింగ్ ఉండదు. కొద్దిపాటి మార్పులతో శనివారం సాయంత్రం ఉన్న ముగింపు ధరకే బంగారం అమ్మకాలు జరుగుతాయి.
ఇక గత సోమవారం(నవంబర్ 09) నుంచి ఆదివారం(అక్టోబర్ 15) వరకూ బంగారం ధరల్లో చోటు చేసుకున్న మార్పులు.. చేర్పులపై విశ్లేషణ.
పసిడి కొంచెం కిందికి..
గత వారంలో (నవంబర్ 09 నుంచి నవంబర్ 15 వరకు) బంగారం ధరలు వారం మొత్తం మీద చూసుకుంటే కొంచెం కిందికి దిగివచ్చాయి. వారం ప్రారంభంలో అంటే నవంబర్ 09 వ తేదీ సోమవారం 22 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 48,600 రూపాయలతో మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. వారం చివరికి వచ్చేసరికి అంటే నవంబర్ 14 శనివారం సాయంత్రానికి 47,700 రూపాయల వద్ద ముగిసింది. అంటే.. 900 రూపాయలు తగ్గింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు నవంబర్ 09 వ తేదీ సోమవారం 53,020 రూపాయల దగ్గర మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. వారం చివరికి వచ్చేసరికి అంటే నవంబర్ 14 శనివారం సాయంత్రానికి 52,050 రూపాయల వద్ద ముగిశాయి. అంటే.. 970 రూపాయలు తగ్గింది. వారం అంతా కొంచెం పైకి.. కొంచెం కిందికి అన్నట్టు కదిలిన బంగారం ధరలు పెద్దగా అంటే భారీస్థాయిలో మాత్రం తేడా చూపించలేదు. దీపావళి, ధనత్రయోదశి సందర్భంగా పసిడికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ధరలూ కాస్త పెరుగుతూ వస్తాయి. కానీ, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా బంగారం ధరల్లో మార్పులు లేకపోవడం విశేషం.
వెండి భారీ పతనం..
గత వారంలో (నవంబర్ 09 నుంచి నవంబర్ 15 వరకు) వెండి ధరలు వారం మొత్తం మీద చూసుకుంటే భారీగానే కిందికి దిగివచ్చాయి. వారం ప్రారంభంలో అంటే నవంబర్ 09 వ తేదీ సోమవారం కేజీ వెండి 65,400 రూపాయలతో మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. వారం చివరికి వచ్చేసరికి అంటే నవంబర్ 14 శనివారం సాయంత్రానికి 63,600 రూపాయల వద్ద ముగిసింది. అంటే.. ఏకంగా ఈవారంలో 17900 రూపాయలు తగ్గింది. వాస్తవానికి మంగళవారం ఒక్కరోజే వెండి కేజీకి 3,500 రూపాయల భారీ పతనం చూసింది. అక్కడ నుంచి కొద్ది కొద్ది గా పెరుగుతూ వచ్చింది. అంటే వారాంతానికి పెరుగుదల బాటలోనే వెండి ఈ వారంలో తన ప్రస్తానం ముగించింది.
ఇక ఈనెల అంతా శుభకార్యాలు ఉన్నాయి. ప్రజలు బంగారం కొనుగోలుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిమాండ్ పెరిగే అవకాశం నేపధ్యంలో బంగారం, వెండి ధరలు గత వారం కంటె ఈ వారం కాస్త పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ పెరుగుదల భారీ స్థాయిలో ఉండే అవకాశాలు లేవని వారంటున్నారు. ఒకరకంగా చూస్తె పసిడి ప్రియులకు కొనుగోలుకు ఇది మంచి సమయం అని వారు అంటున్నారు.