Gold Price Today: బడ్జెట్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!
Budget 2024: ఆకాశమే హద్దుగా చెలరేగిన బంగారం.. నేలచూపులు చూస్తోంది.
Budget 2024: ఆకాశమే హద్దుగా చెలరేగిన బంగారం.. నేలచూపులు చూస్తోంది. ధరల పెరుగుదలతో పరుగులు పెట్టిన పసిడికి కేంద్ర బడ్జెట్ బ్రేకులు వేసింది. ఇన్నాళ్లూ పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలే లేకుండా పసిడి ప్రియుల గుండెల్లో పరుగులు పెట్టించిన బంగారం ఇప్పుడు ఉన్నట్టుండి 3 వేల రూపాయలు పతనమైంది. వందకు మించి తగ్గే పరిస్థితి లేదనుకున్న బంగారం వేలల్లో పడిపోయింది.
భారతదేశంలో పసిడికి ఉన్న డిమాండ్ వేరు. కొందరికి ఇది అలంకార ఆభరణమైతే చాలా మందికి ప్రెస్టేజియస్ వస్తువు. ఆ డిమాండ్‌తోనే బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఆ బంగారం కాస్తా స్థిరాస్థి స్థాయికి రావడంతో సామాన్యుడికి అందనంత రేంజ్‌కు వెళ్లింది బంగారం. మేలిమి బంగారం 73 వేలకు.. 22 క్యారెట్ల బంగారం విలువ 67 వేలకు చేరింది. అయితే తాజాగా బడ్జెట్‌లో పన్నులు తగ్గడంతో ఆ ధరలు ఒక్కసారిగా దిగిపోయాయి.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దేశీయ తయారీకి ప్రోత్సాహకమిచ్చేలా నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా పలు లోహాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింది. బంగారం, వెండిపై 10 శాతం ఉన్న కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అలా కేంద్రం కస్టమ్ డ్యూటీ తగ్గించిందనే నిర్ణయం వెలువడటంతోనే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలకు బ్రేక్ పడింది. రెండు గంటల్లోనే మార్కెట్‌లో పది గ్రాముల బంగారానికి 2 వేల 990 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70 వేల 860కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64 వేల 950కు తగ్గింది. అటు వెండిపై కూడా కస్టమ్ డ్యూటీ తగ్గడంతో కిలో వెండికి 3 వేల 500 రూపాయల ధర తగ్గి 88వేలకు చేరింది.
బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడం పసిడి ప్రియులకు బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. పది రోజులు పోతే శ్రావణ మాసం రానుంది. దీంతో శుభకార్యాలకు సిద్ధమవుతున్న జనం బంగారం ధరలు తగ్గడం అదృష్టంగా భావిస్తున్నారు. సాధారణంగానే బంగారం కొనుగోళ్ల కోసం ఎగబడే జనాలు ధరలు కాస్త తగ్గాయంటే క్యూ కడతారు. అలాంటిది వేలల్లో ధరలు తగ్గాయి. అందులోనూ ముందున్నది పెళ్లిళ్ల సీజన్. దీంతో కొనుగోళ్లు భారీగా జరిగే అవకాశాలున్నాయి.