Lakhpati Didi: ఎలాంటి వడ్డీ లేకుండా రూ. 5 లక్షల రుణం.. మహిళల కోసం ప్రత్యేకం..!

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉండాలి.

Update: 2024-08-28 08:57 GMT

 Lakhpati Didi: ఎలాంటి వడ్డీ లేకుండా రూ. 5 లక్షల రుణం.. మహిళల కోసం ప్రత్యేకం..!

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల పథకాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు దృష్టిలో పలు రకాల పథకాలను ప్రవేశపెట్టాయి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి ఓ బెస్ట్‌ పథకాల్లో లక్‌పత్ దీదీ ఒకటి. ఈ పథకం ద్వారా ఔత్సాహిక మహిళా వ్యాపార వేత్తలు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు పొందొచ్చు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2023లో తీసుకొచ్చింది.

కేంద్రగ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు రుణాలు అందిస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉండాలి. అలాగే 18 నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సందర్శించాలి. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, ఎస్‌హెచ్‌జీ సభ్యత్వ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఫోన్ నంబర్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అందించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫామ్‌లో పేర్కొన్న వివరాలతో పాటు డాక్యుమెంట్లను జతపరిచి సంబంధిత అధికారులకు అందించాల్సి ఉంటుంది. అధికారులు దరఖాస్తును పరిశీలించి, అన్ని అర్హతలుంటే వడ్డీ లేని రుణాన్ని అందిస్తారు. గరిష్టంగా రూ. 5 లక్షల వరకు రుణం పొందొచ్చు. ఇక కేవలం రుణం ఇవ్వడానికి మాత్రమే పరిమితం కాకుండా.. రుణం మంజూరైన తర్వాత మీరు చేయాలనుకునే వ్యాపారానికి అవసరమైన శిక్షణను కూడా అందిస్తారు. ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్, ఆన్ లైన్ వ్యాపారం వంటి శిక్షణను అందిస్తారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 2కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల ప్రవేశ పెట్టిన 2024-25 ఇంటరిమ్ బడ్జెట్లో దాదాపు 3కోట్ల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధిచేకూర్చాలని నిర్ధేశించుకున్నారు.

Tags:    

Similar News