Health Insurance: ఆరోగ్య బీమా అత్యవసరం.. చికిత్స ఉచితం ఇంకా పన్ను ఆదా..!
Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరో 20 రోజుల్లో మార్చి నెల ముగియనుంది. ఈ పరిస్థితిలో మీరు పన్ను ఆదా చేయడానికి ఆరోగ్య బీమా తీసుకోవచ్చు. వైద్యపరంగా ఆరోగ్య బీమా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అనారోగ్యం, ప్రమాదం, ఏదైనా అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఆరోగ్య బీమా ఖర్చులను కవర్ చేస్తుంది. ఆరోగ్య బీమా పథకాలు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80డి కింద పన్ను ఆదా చేయడంలో సహాయపడతాయి. పాలసీదారు ఆరోగ్య బీమా ప్రీమియం ఆధారంగా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.
ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడం వల్ల ముఖ్యంగా మూడు ప్రయోజనాలు ఉన్నాయి. అనారోగ్యం విషయంలో చికిత్స అందుబాటులో ఉంటుంది. పన్ను ఆదా అవుతుంది. ప్రమాదం నుండి రక్షణ ఉంటుంది. కొవిడ్ సమయంలో ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల ఆరోగ్య బీమాకి ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. ప్రజల్లో కూడా అవగాహన బాగా పెరగింది. చాలామంది ఆరోగ్య బీమాని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ పాలసీ ఎంపికలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు.
ఆరోగ్య బీమాకోసం ఏదో ఒక పాలసీని తీసుకోవడంలో ఎటువంటి ప్రయోజనం ఉండదు. కుటుంబ, వైద్య అవసరాలకి తగిన విధంగా పాలసీ ఎంచుకోవడం ముఖ్యం. ఏ సంస్థ నుంచి బీమా కొనుగోలు చేయాలి.. కవరేజీ ఎంత ఉండాలి. బీమా సంస్థ ఎంతవరకు క్లెయిమ్ చేస్తుంది.. వెయింటింగ్ పీరియడ్ ఎంతుంది.. తదితర విషయాలు పూర్తిగా తెలుసుకున్నాకే పాలసీని కొనుగోలుచేయడం మంచిది.
క్లెయిమ్ ప్రాసెస్ ప్రతి బీమా సంస్థకి వేరు వేరుగా ఉంటుంది. అందుకే పాలసీ తీసుకునేటప్పుడే క్లెయిమ్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైనా ప్రాసెస్ అనేది సులభంగా పూర్తయ్యే విధంగా ఉండాలి. అలాగే ప్రీమియం ఒక్కటే కొలమానం కాదు. ఆస్పత్రుల్లో చేరినప్పుడు వైద్య ఖర్చులతోపాటు ఇతర ఖర్చులని కూడా భరించే విధంగా ఉండాలి. కాస్త ప్రీమియం ఎక్కువగా ఉన్నప్పటీకీ ప్రయోజనాలు తెలుసుకున్న తర్వాత కొనుగోలు చేయాలి.