Hyderabad: పేపరు, పాత సామాన్లకు పెట్రోల్.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వినూత్న ప్రయోగం
Hyderabad: మీ ఇంట్లో పాతపేపర్లు, ప్లాస్టిక్ సామాను ఉందా..?
Hyderabad: మీ ఇంట్లో పాతపేపర్లు, ప్లాస్టిక్ సామాను ఉందా..? పని చేయని ఫోన్లు, పనికిరాని ల్యాప్ టాప్ లు ఉన్నాయా ? అయితే వాటన్నంటిని పాత సామాను వాడికి అమ్మేయ్యనక్కర్లేదు. వీటి నుంచి మీకు పెట్రోల్ వస్తుంది. అదేంటి పాత సామాను నుంచి పెట్రోల్ రావడం ఏంటి అని షాక్ అవుతున్నారా. అయితే వాచ్ దిస్ స్టోరీ.
ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులు, పేపర్, పుస్తకాలు, ప్లాస్టిక్, ఈ-వేస్ట్ మెటిరియల్న్ చెత్తబుట్టలో పడేయకుండా వాటితో పెట్రోల్ వస్తుంది. రోజురోజుకు పెరిగిపోతున్న ప్లాస్టిక్ తో పాటు ఈ వేస్ట్ కు చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ముందడుగు వేసింది. దీని కోసం సరికొత్త ప్లాన్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, రిసైకిల్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ స్కీంను తెరపైకి తీసుకొచ్చాయి. వినియోగదారులకు రీ ఫ్యూయల్ విత్ రీ సైకిల్ కార్యక్రమంతో సరికొత్త ఆఫర్ ప్రకటించాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, కాగితం, పనికిరాని మొబైళ్లు, ల్యాప్టాప్, నెట్ వర్క్ పరికరాలు, కేబుళ్లు, ఇతర వ్యర్థాలను తీసుకెళ్తే ఇంధన క్రెడిట్లు పొందే సదుపాయం కల్పిస్తున్నాయి.
ఈ ఇంధన క్రెడిట్లను పెట్రోల్ బంకుల్లో వినియోగించుకోవచ్చు. మన బైక్, కార్ ఏదైనా సరే వాటిలో పెట్రోల్ పోయించుకునేందుకు ఇంధన క్రికెట్లను వాడుకోవచ్చు. మన మొబైల్లో నమోదైన ఇంధన క్రిడిట్లను చూపించి దానికి సరపడా ఇంధనాన్ని నింపుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్న వేస్ట్ మెటిరీయలను పెట్రోల్ బంకులో ఇచ్చిన తర్వాత స్కాన్ చేయాలి..ఆ తర్వాత మన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే చాలు..మనకు క్రెడిట్స్ కౌంట్ అవుతాయి. ఒక కస్టమర్ 9 కేజీల న్యూస్ పేపర్లను ఇవ్వగా...అతనికి 100 రూపాయల పెట్రోల్ ను తన బైక్ లో పోయించుకున్నారు. అతను కేవలం 2 రూపాయల 80 పైసలను మాత్రమే తిరిగి చెల్లించాల్సి వచ్చింది. అయితే ఈ విధానం ఎంతో బాగుందని పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు పెట్రోల్ కూడా వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు వినియోగదారులు.
అయితే ప్రస్తుతం ప్రయోగత్మకంగా నగరంలోని కేవలం 5 పెట్రోల్ బంక్ లలో మాత్రమే ఈ విధానం అమలు చేస్తున్నారు. హైటెక్ సిటీ, రాయదుర్గం మెట్రో స్టేషన్ పక్కన ఉన్న IOCL, మదీనాగూడ, బేగంపేట, జూబ్లీహిల్స్ IOCL, ఐకియా స్టోర్ పక్కన ఉన్న IOCL ఫిల్లింగ్ స్టేషన్లలో ఈ సదుపాయాన్ని కల్పించారు. ఈ 5 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకుల్లో...ఈ వ్యర్థాలను తీసుకొచ్చి..ఇంధన క్రెడిట్లను పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. వ్యక్తిగతంగా తీసుకొచ్చే వాళ్ళు 10కేజీల కన్నా ఎక్కువ తీసుకొస్తే అదనంగా 1 లీటర్ ఇంధనాన్ని పొందవచ్చని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు.
ఇంట్లో పనికిరాని వస్తువులును చెత్తబుట్టలో వేసే బదులు...ఇలా పెట్రోల్ బంకులోకి తీసుకెళ్లి ఇంధన క్రెడిట్లు పొందే అవకాశం ఉండడంతో అందరూ ఇలాంటి మంచి ఛాన్స్ ను వినియోగించుకోవాలని రీ సైకిల్ సంస్థ నిర్వాహకులు చెప్తున్నారు. ఇలాంటి మంచి అవకాశాన్ని నగరవాసులంతా ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. అయితే ఈ ప్రయోగం సక్సెస్ అయితే...నగర వ్యాప్తంగా ఉన్న IOC పెట్రోల్ బంకుల్లో స్కీంను అమలు చేస్తామన్నారు.