EPFO: పీఎఫ్ ఖాతాదారులకి శుభవార్త.. పెన్షన్ పొందడం చాలా సులువు..!
EPFO: ఉద్యోగుల పెన్షన్ వ్యవస్థని నిర్వహించే సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).
EPFO: ఉద్యోగుల పెన్షన్ వ్యవస్థని నిర్వహించే సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).ఇప్పుడు ఈ సంస్థ పెన్షనర్ల కోసం సరికొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. దాదాపు 73 లక్షల మంది పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్‌లను డిజిటల్‌గా ఫైల్ చేయడానికి ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తోంది.ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ అనుమతిని ఇచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
చాలామంది వృద్ధాప్యం కారణంగా బయో-మెట్రిక్ (వేలిముద్ర, ఐరిస్) సరిపోలకపోవడంతో ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈపీఎఫ్‌వో ప్రారంభించిన ఈ సదుపాయం కారణంగా లైఫ్ సర్టిఫికేట్ ఫైల్ చేయడం సులువు అవుతుంది. ఇక పెన్షన్ పొందడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాస్తవానికి పెన్షన్ ప్రయోజనాలను పొందడానికి జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి అని అందరికి తెలిసిందే.
ఈపీఎఫ్‌వో ప్రారంభించిన ఫేస్ రికగ్నిషన్ సదుపాయాన్ని పెన్షనర్లు ఎక్కడి నుంచైనా పొందవచ్చు. అంతేకాదు దీనికి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పాటు పెన్షన్, ఉద్యోగుల డిపాజిట్లకు సంబంధించిన బీమా పథకం కాలిక్యులేటర్‌ను కూడా కార్మిక మంత్రి ప్రారంభించారు. దీనివల్ల పెన్షనర్లు, కుటుంబ సభ్యులు పెన్షన్‌తో పాటు మరణ ప్రయోజనాలను లెక్కించడానికి వీలవుతుంది.