EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకి అలర్ట్.. బోర్డు మరో సరికొత్త నిర్ణయం..!
EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులు ఇప్పుడు మరింత వడ్డీ పొందే అవకాశం ఉంది.
EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులు ఇప్పుడు మరింత వడ్డీ పొందే అవకాశం ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి EPF బోర్డు వడ్డీని 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది. దీనివల్ల తీవ్ర విమర్శలకు గురవుతోంది. దీనిని తొలగించుకోవడానికి EPFపెట్టుబడిదారులకు అధిక రాబడిని ఇవ్వాలని యోచిస్తోంది. వాస్తవానికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పరిమితిని పెంచడంపై EPFO బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జూలై 29, 30, తేదీలలో ఈపీఎఫ్‌వో బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్టాక్ మార్కెట్, సంబంధిత ఉత్పత్తులలో పెట్టుబడి పరిమితిని 15 శాతం కంటే ఎక్కువగా పెంచే అవకాశాలు ఉన్నాయి. EPF బోర్డు ఈ నిర్ణయం తీసుకుంటే పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ రాబడిని పొందవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పరిమితుల పెంపును ట్రేడ్ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. ఈ పెట్టుబడులపై ప్రభుత్వ గ్యారంటీ లేదని దీనివల్ల పెట్టుబడిదారులు నష్టపోవాల్సి వస్తుందని వాదిస్తున్నారు.
వాస్తవానికి ఈసారి EPFO ఈక్విటీలో పెట్టుబడుల వల్ల 2021-22లో 16.27 శాతం రాబడిని పొందింది. ఇది 2020-21లో 14.67 శాతంగా ఉంది. EPFO 15 సంవత్సరాల పాటు న్యూక్లియర్ పవర్ బాండ్లలో పెట్టుబడి పెట్టింది. వీటిపై వార్షికంగా 6.89 శాతం వడ్డీ వస్తోంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బాండ్లపై 7.27 శాతం నుంచి 7.57 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. సహజంగానే EPFO ప్రభుత్వ బాండ్ల నుంచి తక్కువ రాబడిని పొందుతోంది.