Home Loan NOC: తొందరపడి హోమ్‌లోన్ తీసుకోవద్దు.. దీనిపై స్పష్టత వచ్చాకే ముందుకు వెళ్లండి..!
Home Loan NOC: ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగంలో చేరగానే హోమ్‌లోన్ గురించి ఆలోచిస్తున్నారు. ఇందుకోసం అధిక వడ్డీల వద్ద లోన్ తీసుకొని చివరకి ఈఎంఐ కట్టలేక దివాళ తీస్తున్నారు.
Home Loan NOC: ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగంలో చేరగానే హోమ్‌లోన్ గురించి ఆలోచిస్తున్నారు. ఇందుకోసం అధిక వడ్డీల వద్ద లోన్ తీసుకొని చివరకి ఈఎంఐ కట్టలేక దివాళ తీస్తున్నారు. అందుకే హోమ్‌లోన్ తీసుకునేటప్పుడు కచ్చితంగా కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. లేదంటే బ్యాంకర్ల చేతిలో పడి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణ కాలంలో జీతం ఆధారంగా ఇంటిని కొనుగోలు చేయడం అంత సులభం కాదు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు గృహ రుణాలను అందిస్తున్నాయి. కానీ దీని గురించి ఆలోచించేటప్పుడు వడ్డీ రేటుతో పాటు NOC గురించి తెలుసుకోవాలి.
NOC ఎందుకు అవసరం?
లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించిన తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) తీసుకోవాలి. 30 సంవత్సరాల పాటు హోమ్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. ఆ లోన్ మొత్తాన్ని 5 సంవత్సరాల్లో తిరిగి చెల్లిస్తే ఎన్ని రోజుల్లో NOC ఇస్తారనే దానిపై క్లారిటీ ఉండాలి. లోన్ చెల్లించిన తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తీసుకోకుంటే ఆర్థిక, చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
NOC అనేది ఒక ప్రత్యేక పత్రం. ఇది మీరు అరువు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించారని, లోన్‌కు సంబంధించిన అన్ని బాధ్యతలను నెరవేర్చారని రుజువు చేస్తుంది. చాలా మంది గృహ రుణాన్ని చెల్లించిన తర్వాత NOC తీసుకోవడం మరిచిపోతారు. దీనివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. పర్సనల్ లోన్ కంటే హోమ్ లోన్ తిరిగి చెల్లించిన తర్వాత NOC పొందడం చాలా ముఖ్యం. ఇది లోన్ క్లోజింగ్ ప్రాసెస్‌లో ఒక భాగం. ఇది మీ ఆస్తి మొత్తానికి సంబంధించిన ఏదైనా వివాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది
NOC క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. రుణదాతలు ఒక వ్యక్తి క్రెడిట్ యోగ్యతను అంచనా వేయడానికి క్రెడిట్ నివేదికలపై ఆధారపడుతారు. NOC తీసుకోకుంటే క్రెడిట్ రిపోర్ట్‌లో లోన్ పెండింగ్ చూపిస్తూ ఉంటుంది. ఇది క్రెడిట్ స్కోర్‌ను నెగిటివ్‌గా మారుస్తుంది. భవిష్యత్‌లో హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ వంటి ఇతర క్రెడిట్ సేవలకు యాక్సెస్‌ను కోల్పోతారు. ఇది మాత్రమే కాదు భవిష్యత్‌లో ఇంటిని విక్రయించాలంటే NOC లేకుండా విక్రయించలేరు. ఎందుకంటే రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని కొనుగోలుదారులు భావిస్తారు.
వడ్డీ, ఇతర ఛార్జీలు
ఒక వ్యక్తి లోన్ మొత్తాన్ని చెల్లించిన తర్వాత NOC తీసుకోపోతే బ్యాంకు నుంచి మెసేజ్‌లు, వడ్డీ పెరిగినట్లు మెస్సేజ్‌లు వస్తాయి. దీని వెనుక కారణం బ్యాంకులు NOC లేకుండా మీ లోన్‌ని క్లోజ్ చేయలేవు. ఈ కేసులో రుణం తీసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు వారికి ఉంటుంది. దీని వల్ల ఆస్తుల జప్తు లేదా నెలవారీ జీతాన్ని కోల్పోతారు. తర్వాత అది మీకు ఆర్థిక భారాన్ని కలిగిస్తుంది. అందువల్ల లోన్ మొత్తాన్ని చెల్లించిన తర్వాత NOC తీసుకోవడం మరిచిపోవద్దు.