Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు అల్లకల్లోలం.. ఫలితాలు చూస్తుండగానే రూ.30 లక్షల కోట్లు ఆవిరి
Stock Market: ఎగ్జిట్ పోల్స్ తారుమారు కావడంతో దలాల్ స్ట్రీట్ చరిత్రలోనే అతిపెద్ద నష్టాలు నమోదు అయ్యాయి.
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌లో భారీ క్రాష్ కనిపించింది. ఎన్నికల ఫలితాల వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. రికార్డు స్థాయిలో BSE, NSE సూచీలు క్షీణించాయి. సెన్సెక్స్‌లోని అన్ని షేర్లు రెడ్ మార్క్‌లోనే కనిపించాయి. ఉదయం నుంచి స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ఉంది. ఇందుకు కారణాలేంటి...? నిన్న రంకెలెత్తిన బుల్ బేజార్ కావడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ...
రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడితే... ఎగ్జిట్ పోల్స్ తెచ్చిన ఉత్సాహంతో స్టాక్ మార్కెట్‌లో నిన్న లాభాల కుంభవృష్టి కురిసింది. సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మరోసారి విజయఢంకా మోగించ వచ్చన్న అంచనాలతో సోమవారం ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలు నమోదుచేశాయి. వరుసగా మూడోసారీ ఎన్‌డీఏ ఏర్పడితే, సంస్కరణలు-విధాన నిర్ణయాలు కొనసాగుతాయనే భావనే ఇందుకు కారణం. సెన్సెక్స్ ఒక్కరోజులోనే 2 వేల 507 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 733 పాయింట్ల మేర లాభపడింది. 2019 మే 20న సైతం ఎన్‌డీఏ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో సూచీలు 3% మించి దూసుకెళ్లాయి.
ఎగ్జిట్ పోల్స్ తారుమారు కావడంతో దలాల్ స్ట్రీట్ చరిత్రలోనే అతిపెద్ద నష్టాలు నమోదు అయ్యాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం అల్లకల్లోలమయ్యాయి. ఫలితాలు చూస్తుండగానే 30 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఆరంభంలోనే బేర్ గుప్పిట్లో చిక్కిన స్టాక్ సూచీలు ఏ దశలోనూ బయటకు రాలేకపోయాయి. సమయం గడుస్తున్నా... కొద్ది మరింత దిగజారుతూ మదుపర్లను వణికించాయి. సెన్సెక్స్ ఉదయం 2 వేల పాయింట్లకు పైగా నష్టంతో 76 వేల 285 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో రికార్డు స్థాయిలో 6 వేల పాయింట్లకు పైగా కుంగి 70 వేల 234 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 4 వేల 390 పాయింట్ల నష్టంతో 72 వేల 79 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో దాదాపు 19 వందల పాయింట్ల వరకు కుంగి 21 వేల 281 దగ్గర దిగువ స్థాయికి చేరింది. చివరకు 13 వందల 79 పాయింట్లు నష్టపోయి 21 వేల 884 వద్ద నిలిచింది.
ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు కాస్త భిన్నంగా ఉన్నాయి. అధికారం విషయంలో ఎన్డీయేకి మెజారిటీ మార్క్ దాటినప్పటికీ.. సీట్ల విషయంలో మాత్రం లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయే దాదాపు 350 స్థానాల వరకు గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ, వాస్తవంలో ఆ సంఖ్యకు దిగువనే ఉండటంతో మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. గత ఎన్నికల్లో ఒంటరిగానే ప్రభుత్వ ఏర్పాటు కోసం కావాల్సిన మెజారిటీ సాధించిన బీజేపీకి ఈసారి కూటమి అవసరం అనివార్యమైంది. దీంతో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మదుపర్ల అంచనాలు తప్పాయి. మరోవైపు 150 సీట్లకే పరిమితమవుతుందనుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ అనూహ్యంగా పుంజుకొని 220 మార్క్ దాటింది. నేటి నష్టాలకు ఇదే ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాల జోరులో బ్యాంకింగ్, ప్రభుత్వ రంగ సంస్థలు సోమవారం భారీగా పుంజుకున్నాయి. నేడు అవన్నీ పెద్దఎత్తున కుంగి సూచీలను బేర్ గుప్పిట్లోకి నెట్టాయి. ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, రిలయన్స్ వంటి బడా సంస్థలు భారీగా నష్టపోవడం మార్కెట్లను ఎరుపెక్కించాయి. అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ భారీ నష్ట ాల్లో ముగిసాయి.