Stock Market: భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్
Stock Market: ఒక్క సెషన్‌లోనే రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల లాభాల పరంపరకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు నష్టపోయాయి. వచ్చే వారం కేంద్ర బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో ముఖ్యంగా మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో ఒక్క సెషన్‌లో ఏకంగా 8 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ 738.81 పాయింట్ల నష్టంతో 80 వేల 604.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 269.95 పాయింట్ల నష్టంతో 24 వేల 530.90 వద్ద స్థిరపడింది.
మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన అంతరాయం ప్రభావం తమపై లేదని BSE, NSEలు ప్రకటించాయి. తమ సేవలు యథావిధిగా కొనసాగినట్లు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించాయి. మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక అంతరాయం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు, బ్యాంకింగ్ సేవలతో పాటు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలూ ప్రభావితమైన నేపథ్యంలో ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి.