Car Insurance: జంతువులు ఢీ కొన్నట్లయితే ఇన్సూరెన్స్ వర్తిస్తుందా..?
Car Insurance: కారులో ప్రయాణిస్తున్నప్పుడు కొన్నిసార్లు సడెన్‌గా జంతువులు అడ్డు వస్తాయి.
Car Insurance: కారులో ప్రయాణిస్తున్నప్పుడు కొన్నిసార్లు సడెన్‌గా జంతువులు అడ్డు వస్తాయి. దీంతో ప్రమాదం జరుగుతుంది. కారు డ్యామేజ్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో కారుకి ఇన్సూరెన్స్ వర్తిస్తుందా..లేదా.. ఈ అనుమానం చాలామంది వాహనదారులకి ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి నష్టాలని భరించడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు వస్తాయా..? ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
భారతదేశంలో రోడ్లపై రకరకాల జంతువులు తిరుగుతాయి. ఆవు, ఎద్దు, కుక్క, కోతి వంటి జంతువులు తరచుగా రోడ్డుపై కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు ఇవి ప్రమాదాలకి కూడా కారణమవుతాయి. అయితే చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు సమగ్ర బీమా పాలసీలలో (కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ) జంతువుల దాడులను కవర్ చేస్తాయి. కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వర్తించదు. అందుకే ఇలాంటి ప్రమాదాలని నివారించాలంటే సమగ్ర బీమాని మాత్రమే కొనుగోలు చేయాలి.
జంతువుల వల్ల ప్రమాదాలు
కొన్నిసార్లు దారిలో ఉన్న జంతువును రక్షించే ప్రయత్నంలో డ్రైవర్ మరేదానినైనా ఢీకొట్టవచ్చు. ఇలాంటి సందర్భంలో ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇంట్లో పెంపుడు జంతువు ఉంటే అది కారు సీటుని కొరుకుతూ డ్యామేజ్ చేసిన సందర్భంలో కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అలాగే ఎలుకలు కారును పాడు చేసినప్పుడు, పక్షి అనుకోకుండా కారు లోపలికి వచ్చినప్పుడు జరిగే నష్టాలకి కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
సమగ్ర బీమా పాలసీ
ఇటువంటి విభిన్న పరిస్థితులు సమగ్ర బీమా పాలసీలో కవర్ అవుతాయి. కానీ థర్డ్ పార్టీలో కవర్ కావు. సమగ్ర బీమా పాలసీ దాదాపు ప్రతి నష్టాన్ని కవర్ చేస్తుంది. కాబట్టి ఈ పాలసీ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.