Savings And Investment: పొదుపు, పెట్టుబడి పథకాలలో ఈ పొరపాట్లు చేయవద్దు.. చాలా బాధపడుతారు..!
Savings And Investment: పొదుపు, పెట్టుబడులు అనేవి జీవితంలో చాలా ముఖ్యం. కుటుంబ ఆర్థిక పరిస్థితి ఈ రెండింటిపై ఆధారపడి ఉంటుంది.
Savings And Investment: పొదుపు, పెట్టుబడులు అనేవి జీవితంలో చాలా ముఖ్యం. కుటుంబ ఆర్థిక పరిస్థితి ఈ రెండింటిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరు పొదుపు చేస్తారు పెట్టుబడులు కూడా పెడుతారు. కానీ వీటిని చివరి వరకు సమర్థవంతంగా నిర్వహించరు. దీంతో వచ్చిన ఆదాయం అవసరాలకి సరిపోక చాలా బాధపడుతారు. పొదుపు చేస్తున్నప్పుడు చాలమంది కొన్ని తప్పులు చేస్తారు. వీటి కారణంగా వారు మెచ్యూరిటీపై పెట్టుబడి పూర్తి ప్రయోజనం పొందలేరు. అంతేకాకుండా ఇతర సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి తప్పుల గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వృద్ధాప్యం గురించి మరిచిపోతారు
చాలామంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుని కాపాడటం కోసం వారి వృద్ధాప్యం గురించి ఆలోచించడం మరచిపోతారు. పిల్లల కోసం అనేక పొదుపు పథకాలలో పెట్టుబడి పెడతారు కానీ తమ కోసం ఎటువంటి పాలసీ తీసుకోరు. ఇది వారు చేసే అతిపెద్ద తప్పు. దీని కారణంగా వృద్ధాప్యంలో చాలా బాధపడుతారు. పిల్లల కోసం పాలసీ తీసుకున్నట్లే వృద్ధాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని మీ కోసం కూడా పాలసీ తీసుకోవాలి.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం
కాలం మారుతున్న కొద్ది ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుంది. 20 ఏళ్ల క్రితం లీటరు పెట్రోల్ రూ.40-50 ఉంటే ఇప్పుడు రూ.100కు పైగా విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితిలో పెట్టుబడి పెట్టేటప్పుడు 15-20 సంవత్సరాల ద్రవ్యోల్బణం ప్రకారం ప్లాన్ చేయాలి. చిన్న తరహా పథకంలో పెట్టుబడి పెట్టినట్లయితే తర్వాత బాధపడాల్సి ఉంటుంది.
పెట్టుబడిలో జాప్యం
కొంతమంది పొదుపు పథకం తీసుకోవాలా వద్దా అనే అయోమయంలో ఉంటారు. దీనివల్ల విలువైన సమయాన్ని కోల్పోతారు. తర్వాత పెట్టుబడి పెట్టినప్పుడు వారికి ఎక్కువ సమయం మిగిలి ఉండదు. దీంతో మెచ్యూరిటీలో తక్కువ మొత్తాన్ని పొందుతారు.
అవసరాన్ని బట్టి పొదుపు పథకం
అవసరాన్ని బట్టి పొదుపు పథకం ఎంచుకోవాలి. ఉదాహరణకు మీ కుమార్తె వివాహం లేదా ఆమె చదువు కోసం డబ్బు ఏర్పాటు చేయాలనుకుంటే సుకన్య సమృద్ధి యోజన ఉత్తమమైనది. అలాగే తక్కువ సమయంలో ధనవంతులుగా మారడానికి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం మంచిది. వృద్ధాప్యంలో సురక్షితంగా ఉండటానికి ఎల్‌ఐసీ పాలసీ ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. అందుకే జీవితంలో సరైన పొదుపు పథకాన్ని ఎంచుకోవడం ముఖ్యం.
భవిష్యత్తు ఖర్చులు
ఏదైనా ఫ్యూచర్ సేవింగ్స్ ప్లాన్‌ను ఎంచుకునేటప్పుడు భవిష్యత్తులో చేసే ఖర్చులను కూడా అంచనా వేయాలి. ఉదాహరణకు పిల్లల చదువుల కోసం పొదుపు పథకం తీసుకోవాలంటే 50 వేలు లేదా లక్ష పొదుపు పథకం పనిచేయదు. రాబోయే 10-15 ఏళ్లలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని కనీసం రూ. 5 లక్షల పొదుపు పథకాన్ని తీసుకోవాలి. దీని కంటే తక్కువ తీసుకుంటే తర్వాత బాధపడాల్సి ఉంటుంది.