Diwali 2022: దీపావళి పెట్టుబడులు బలమైన రాబడులు.. అవేంటంటే..?
Diwali 2022: హిందువులకి సంబంధించి అత్యంత ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి.
Diwali 2022: హిందువులకి సంబంధించి అత్యంత ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఈ పండుగకి ముందే పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకి డీఏ పెంచాయి. తర్వాత పాత నెలల బకాయిలు కూడా అందాయి. దీంతో పాటు పలు ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు దీపావళి సందర్భంగా ఉద్యోగులకు బోనస్ అందిస్తున్నాయి. వీటన్నిటిని సరైన మార్గంలో ఉపయోగించడం ముఖ్యం. వాస్తవానికి బోనస్ అమౌంట్ తక్కువగానే వస్తుంది. కానీ వాటిని సరిగ్గా ఉపయోగించినట్లయితే భవిష్యత్తులో చాలా సహాయపడుతుంది.
1. పాత బకాయిలు చెల్లించడం
అప్పు అనేది చాలా ప్రమాదకరమైనది. వీలైనంత త్వరగా తీర్చడం ముఖ్యం. అందుకే గృహ రుణం లేదా కారు లోన్ వంటి రుణాన్ని చెల్లించడానికి ఈ దీపావళి బోనస్‌ని ఉపయోగించవచ్చు. అధిక వడ్డీ రేటు చెల్లించాల్సిన రుణాన్ని ముందుగా చెల్లించాలని గుర్తుంచుకోండి. కస్టమర్లు క్రెడిట్ కార్డుపై అత్యధిక వడ్డీ రేటును చెల్లించాల్సి ఉంటుంది.
2. ఎమర్జెన్సీ ఫండ్
ఆర్థిక నిపుణులు ఎల్లప్పుడూ అత్యవసర నిధిని ఉంచుకోవాలని సలహా ఇస్తారు. ఈ ఫండ్ మీ పొదుపులో ఉండదని గుర్తుంచుకోండి. ఉద్యోగంలో లేనట్లయితే కనీసం 6 నెలల పాటు ఇంటి ఖర్చులను భరించగలిగేలా ఈ మొత్తం ఉండాలి. అత్యవసర నిధుల కోసం మీరు FD, మ్యూచువల్ ఫండ్‌లు, బంగారం మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు.
3. ఆరోగ్య బీమా
మీరు ఇంకా ఆరోగ్య బీమాను కొనుగోలు చేయనట్లయితే వీలైనంత త్వరగా కొనుగోలు చేయండి. చాలా మంది వ్యక్తులు ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపరు. కానీ అనారోగ్యం సమయంలో ఇది మీకు ఆర్థిక భద్రతగా నిలుస్తుంది. మీరు దీపావళి బోనస్‌తో మొత్తం కుటుంబానికి ఆరోగ్య బీమాను కొనుగోలు చేయవచ్చు .
4. పెట్టుబడిని పెంచుకోండి
మీరు దీపావళి బోనస్‌తో పెట్టుబడిని పెంచండి. ఉదాహరణకు SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.100 ఇన్వెస్ట్ చేస్తుంటే దానిని 200 లేదా 300కి పెంచుకోవచ్చు. ఇది భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తుంది. దీంతో మీరు ఆర్థిక లక్ష్యాలను తక్కువ సమయంలో సాధించవచ్చు.