పోస్టాఫీసు ఖాతాదారులకి శుభవార్త.. చాలా రోజుల తర్వాత కేంద్రం కీలక నిర్ణయం..!
Post Office Schemes: చాలా రోజుల తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
Post Office Schemes: చాలా రోజుల తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టాఫీసు స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టేవారికి శుభవార్త చెప్పింది. కిసాన్ వికాస్ పత్ర, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లపై వడ్డీరేట్లని పెంచింది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఈ పథకాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే PPF సుకన్య సమృద్ధి యోజన, NSC పై వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు.
ఎంత పెరిగాయి..
కిసాన్ వికాస్ పత్రపై వడ్డీ రేటు 6.9 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. గతంలో కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడి 124 నెలల్లో మెచ్యూర్ అయ్యేది. కానీ ఇప్పుడు 123 నెలల్లో మెచ్యూర్ అవుతుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు 7.4 శాతం నుంచి 7.6 శాతానికి పెరిగింది. నెలవారీ ఆదాయ ఖాతా పథకంపై ఇప్పుడు 6.6 శాతానికి బదులుగా 6.7 శాతం వడ్డీ లభిస్తుంది.
పోస్టాఫీసు రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 5.5 శాతానికి బదులుగా 5.7 శాతం వడ్డీ లభిస్తుంది. 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై 5.5 శాతానికి బదులుగా 5.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 5.5 లో ఎటువంటి మార్పు లేదు. అలాగే ఐదేళ్ల డిపాజిట్ పథకంపై 5.8 శాతం వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు. అయితే అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికానికి PPF, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ వడ్డీ రేట్లలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎటువంటి మార్పు చేయలేదు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) 7.1 శాతం వడ్డీని పొందుతుంది, NSC అంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 6.8 శాతం, సుకన్య సమృద్ధి యోజన 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే పోస్టాఫీసు సేవింగ్స్ డిపాజిట్ ఖాతాపై 4 శాతం వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్‌పై 5.8 శాతం వడ్డీ అలాగే ఉంది. 2020-21 మొదటి త్రైమాసికం నుంచి ఇప్పటి వరకు 10 త్రైమాసికాల్లో చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదన్న విషయం అందరికి తెలిసిందే.