Car Insurance Policy: వర్షాల్లో, వరదల్లో మునిగిన కార్లకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందా ?

Update: 2024-09-01 14:15 GMT

Car Insurance Policy Claims: భారీ వర్షాలు, వరదలు వాహనాల యజమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అదే సమయంలో అక్కడి ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో కానీ లేదా వీధుల్లో పార్క్ చేసి ఉన్న వాహనాలు కానీ వరద నీటిలో మునిగిపోతున్నాయి. ఇంకొన్ని చోట్ల వరద నీటిలో కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో నీట మునిగిన వాహనాల యజమానులు వాటిని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవడం తప్పించి మరేమీ చేయలేని పరిస్థితి. అలాంటి వాళ్లందరినీ ముందుగా వేధిస్తోన్న ఏకైక ప్రశ్న ఒక్కటే.. ' వరదలో మునిగిన నా కారుకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందా ' ? ఈ ఒక్క ప్రశ్నతోనే ఇంకెన్నో ప్రశ్నలు ముడిపడి ఉంటాయి. వరదలో వాహనం మునిగినా లేదా వరదలో కొట్టుకుపోయినా.. ఆ కారుకు ఇన్సూరెన్స్ ఎప్పుడు వర్తిస్తుంది, ఇన్సూరెన్స్ వర్తించాలంటే ఏం చేయాలి ? ఇలా అనేక రకాల ప్రశ్నలకు ఇన్సూరెన్స్ రంగంలో పనిచేసే నిపుణులతో మాట్లాడి, వారి నుండి రాబట్టిన సమాధానాల సమాహారమే ఈ కథనం.

వర్షం నీళ్లలో, వరదల్లో మునిగిన కార్లకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చా ?

యస్... నిరభ్యంతరంగా మీ కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ అంతకంటే ముందుగా మీ కారు ఇన్సూరెన్స్ కవర్ ఎలాంటిదో కన్ఫమ్ చేసుకోవాలి. ఎందుకంటే వరద నీళ్లలో కారు మునిగినప్పుడు అందులో ఎక్కువగా డ్యామేజీ జరిగేది కారు ఇంజన్, గేర్ బాక్సు వంటి వాటికే. వాహనం రిపేర్ ఖర్చులో ఎక్కువ మొత్తం ఖర్చు అయ్యేది కూడా వాటికే. అందుకే, కార్లు నీళ్లలో మునిగినప్పుడు ఇంజన్, గేర్ బాక్సు లాంటివి ఇన్సూరెన్స్‌లో కవర్ అవుతాయా లేదా అనేది మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ కవర్ మీద ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణకు మీ వద్ద కేవలం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే ఉందనుకోండి. అలాంటప్పుడు మీ కారుకి జరిగే డ్యామేజీకి అసలు ఇన్సూరెన్స్ వర్తించనే వర్తించదు.

రెండో ఉదాహరణ చూస్తే.. మీరు కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి... అలాంటప్పుడు కూడా వరదల్లో మునిగిన కారుకు ఇన్సూరెన్స్ కవర్ వర్తించదు. ఎందుకంటే.. ఏ కారులో అయినా ఇంజన్, గేర్‌బాక్స్ వంటి అతి ముఖ్యమైన భాగాలు. ఇవి నీట మునిగి చెడిపోయినట్లయితే.. కేవలం కాంప్రెహెన్సివ్ కవర్‌తో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేరు. కాంప్రెహెన్సివ్ కవర్ అనేది ఇంజన్, గేర్ బాక్స్ లాంటి ముఖ్యమైన భాగాలకు మినహాయించి మిగతా వాటికి మాత్రమే వర్తిస్తుంది.

మరి వరదల్లో మునిగిన కారుకు కూడా ఇన్సూరెన్స్ వర్తించాలంటే ఏం చేయాలి..

కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్‌తో పాటు ఇంజన్ ప్రొటెక్షన్, జీరో డిప్రిషియేషన్ వంటి యాడాన్స్ కూడా తీసుకున్న వాళ్లకి మాత్రమే ఇలాంటి ఘటనల్లో కారు ఇన్సూరెన్స్‌ని ఇంజన్ సహా అన్నిరకాలుగా క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. ఇంజన్ ప్రొటెక్షన్ యాడాన్, జీరో డిప్రీషియేషన్ లాంటి యాడాన్స్ తీసుకోకుండా కేవలం కాంప్రెహెన్సివ్ మాత్రమే తీసుకున్న వాళ్లకు ఇలా వరదల్లో మునిగిన ఘటనల్లో క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు.

అసలు యాడాన్స్ అంటే ఏంటి ?

కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్ కవర్ పరిధిలోకి రాని వాటిని కూడా క్లెయిమ్ చేసుకోవాలంటే.. వాటికి అదనంగా ఈ యాడాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక్కో అదనపు ప్రయోజనం కోసం ఒక్కో యాడాన్ ఉంటుంది. అలా ఇన్సూరెన్స్ మార్కెట్లో చాలా రకాల యాడాన్స్ అందుబాటులో ఉన్నాయి. యాడాన్స్ పెరిగే కొద్దీ ప్రీమియం చార్జ్ పెరుగుతుంది. ఎందుకంటే వాటి వల్ల కలిగే ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి.

ఇంజన్ ప్రొటెక్షన్ యాడాన్: భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించి, కారు నీట మునిగినప్పుడు ఆ కారు యజమానికి ఇంజన్‌తో సహా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలంటే ఈ ఇంజన్ ప్రొటెక్షన్ యాడాన్ తీసుకుని ఉండాలి.

జీరో డిప్రిషియేషన్ యాడాన్: జీరో డిప్రిషియేషన్ అంటే ఏంటంటే.. ఉదాహరణకు ఏ కారు అయినా కొన్న తరువాత సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆ కారు విలువ తగ్గిపోతూ ఉంటుంది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు, లేదా ఇంకేదైనా సమస్యతో క్లెయిమ్‌కి వెళ్లినప్పుడు.. అలా తగ్గుతూ వచ్చిన కారు విలువపైనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ లెక్కిస్తారు. అంతేకాదు.. అందులో సగం అంటే 50 శాతం మాత్రమే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. మిగతా 50 శాతం కారు యజమాని భరించాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ మీరు జీరో డిప్రీషియేషన్ యాడాన్ తీసుకున్నట్లయితే.. ఆ కారు డిప్రీషియేషన్ వ్యాల్యూని పరిగణనలోకి తీసుకోకుండా కారు రిపేర్‌కి అయ్యే మొత్తంలో 95 శాతం వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి. మిగతా 5 శాతాన్ని సాల్వేజ్ చార్జీల కింద కస్టమర్లకు చార్జ్ చేస్తారు. సాల్వేజ్ అంటే ఏదో ఒక విడి భాగాన్ని రీప్లేస్ చేసినందుకు తీసుకునే చార్జీ అన్నమాట.

జీరో డిప్రిషియేషన్ అనేది కేవలం కారు ప్లాస్టిక్, ఫైబర్ విడి భాగాలకు మాత్రమే వర్తిస్తుంది అనే విషయం మర్చిపోవద్దు. కారు మొత్తం కవర్ కావాలంటే కేవలం జీరో డిప్రిషియేషన్ యాడాన్ మాత్రమే సరిపోదు.. అందుకోసం ఇంజన్ ప్రొటెక్షన్ యాడాన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం.

జీరో డిప్రిషియేషన్ ఎప్పటివరకు ఇస్తారంటే..

కారు రిజిస్ట్రేషన్ తేదీ నుండి ఐదేళ్ల వరకు ఈ జీరో డిప్రిషియేషన్ యాడాన్ ఇస్తారు. అయితే, ఇన్సూరెన్స్ మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో కొన్ని కంపెనీలు పదేళ్ల వరకు కూడా జీరో డిప్రిషియేషన్ యాడాన్ అందిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఓ మెలిక పెడుతున్నాయి. అదేంటంటే.. 6వ ఏట నుండి ఆ వాహనంపై ఎలాంటి క్లెయిమ్స్ లేనంత వరకే ఈ జీరో డిప్రిషియేషన్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఆరేళ్ల తరువాత ఒక్కసారి క్లెయిమ్‌కి వెళ్లినా.. ఆ తరువాత ఏడాది జీరో డిప్రిషియేషన్ తీసుకునే అవకాశం కల్పించరు.

మీ కారు కోసం పెట్టిన డబ్బు 100 శాతం మళ్లీ మీ జేబులోకి వచ్చే మార్గం ఉందా ?

చాలామంది వెహికిల్ ఇన్సూరెన్స్ అనగానే ఒక రకమైన అపోహ ఉంటుంది. మనం ఎంత ఖర్చు పెట్టి ఇన్సూరెన్స్ కవర్ తీసుకున్నప్పటికీ.. చివరకు మనం క్లెయిమ్ చేసుకుంటే ఏదో ఒక కొర్రీలు పెట్టి రావాల్సిన దాంట్లో సగమే ఇస్తారు అని. కానీ వాస్తవానికి వందకు 100 శాతం వరకు డబ్బు వాపసు ఇచ్చే ఇన్సూరెన్స్ కవర్స్ కూడా ఉన్నాయి. అది కూడా మీ వాహనం ఎక్స్‌షోరూం ధర మాత్రమే కాదండోయ్.. మీరు చెల్లించిన లైఫ్ టాక్స్ కూడా తిరిగి మీకు ఇచ్చేసే ఇన్సూరెన్స్ కవర్ ఇది. ఈ ఇన్సూరెన్స్ కవర్ పేరు రిటన్ టు ఇన్వాయిస్ కవర్.

ఈ రిటన్ టు ఇన్వాయిస్ కవర్ కింద క్లెయిమ్ చేసుకుంటే.. క్లెయిమ్ ఓకే అయిన వారికి ఎక్స్ షోరూం ధరతో పాటు లైఫ్ రోడ్ టాక్స్ కూడా కలిపి ఆ కారు కొనేటప్పుడు పెట్టిన ప్రతీ రూపాయిని తిరిగి ఇచ్చేస్తారు.

ఎలాంటి సందర్భాల్లో రిటన్ టు ఇన్వాయిస్ కవర్ వర్తిస్తుందంటే..

మీ కారు చోరీకి గురై, ఆ కారు ఆచూకీ ఎంతకీ లభించనప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మీ కారు మొత్తానికి అయిన ధరను తిరిగి ఇచ్చేస్తుంది. అలాగే ఏదైనా కారణాల వల్ల మీ కారుకి చాలా ఎక్కువ డ్యామేజీ జరిగి.. ఆ డ్యామేజీకి అయ్యే రిపేర్ల ఖర్చు ఆ కారు అసలు ధరని దాటిపోతున్న సందర్భంలో ఈ రిటన్ టు ఇన్వాయిస్ కవర్ కింద కారు మొత్తం ధరని తిరిగి ఇచ్చేస్తారు. కారు రిజిస్ట్రేషన్ తేదీ నుండి మూడేళ్ల వరకు మాత్రమే ఈ రిటన్ టు ఇన్వాయిస్ కవర్ వర్తిస్తుంది. మూడేళ్ల కంటే పాత కారుకు ఇది వర్తించదు. రిటన్ టు ఇన్వాయిస్ కవర్ విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీ చాలా కఠినంగా విచారణ చేపట్టి వాస్తవాలు ధృవీకరించుకున్న తరువాతే క్లెయిమ్‌ని ఓకే చేస్తాయి.

రిటన్ టు ఇన్వాయిస్ కవర్ ఎప్పుడు వర్తించదంటే..

మూడేళ్ల వరకు రిటన్ టు ఇన్వాయిస్ కవర్ తీసుకునే అవకాశం ఉందని ముందే చెప్పుకున్నాం. కానీ మొదటి ఏడాది కానీ లేదా రెండో ఏడాది కానీ వెహికిల్ ఏదైనా ప్రమాదానికి గురై క్లెయిమ్‌కి వెళ్లినట్లయితే.. ఆ తరువాతి సంవత్సరం మూడెళ్లలోపే అయినప్పటికీ.. ఆ కారుకు రిటన్ టు ఇన్వాయిస్ కవర్ వర్తించదు. సింపుల్‌గా చెప్పాలంటే మొదటి మూడేళ్లలో ఒక్కసారి క్లెయిమ్‌కి వెళ్లినా సరే.. ఆ తరువాతి నుండి రిటన్ టు ఇన్వాయిస్ కవర్ వర్తించదు.

ఏయే రకాల ఇన్సూరెన్స్ కవర్ కోసం ఎక్కువ ప్రీమియం చార్జ్ చేస్తారు ?

పిండికొద్ది రొట్టే అన్న సామెత చందంగానే ప్రీమియంను బట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు కస్టమర్లకు ప్రయోజనాలు అందిస్తుంటాయి. అలాగే ఎంత ఎక్కువ ప్రయోజనాలు ఉంటే అంత ఎక్కువ ప్రీమియం చార్జ్ అవుతుంది.

ఉదాహరణకు 'థర్జ్ పార్టీ ఇన్సూరెన్స్' కంటే కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్ కవర్‌కి ఎక్కువ ప్రీమియం ఉంటుంది.

'కాంప్రెహెన్సివ్ కవర్‌'తో పాటు యాడాన్స్ తీసుకున్నప్పుడు ఇంకాస్త ఎక్కువ ప్రీమియం చార్జ్ చేస్తారు.

అలాగే కాంప్రెహెన్సివ్, యాడాన్స్ కంటే ఎక్కువ ప్రయోజనాలు అందించే "రిటన్ టు ఇన్వాయిస్ కవర్" తీసుకున్నప్పుడు చెల్లించే ప్రీమియం అన్నింటికంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది కారు మొత్తం ధరను కవర్ చేస్తుంది.

కారు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చేయకూడని పొరపాట్లు

తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవాలనే ఉద్దేశంతో కారు ధరని తక్కువ చేసి చూపడం చేయకూడదు. ఎందుకంటే మన కారు ధరను మనమే తగ్గించుకున్న వాళ్లం అవుతాం. అంతేకాకుండా ఏదైనా ప్రమాదం జరిగి ఇన్సూరెన్స్ క్లెయిమ్‌కి వెళ్లినప్పుడు కారు ధరను కూడా పరిగణనలోకి తీసుకుంటారు అనే విషయం మర్చిపోవద్దు.

కారు తీసుకున్నప్పటి నుండి సంవత్సరాలు గడిచే కొద్ది కారు కండిషన్‌ని, కారు కొనుగోలు చేసిన ఏడాదినిబట్టి కొన్ని రిస్కులు పెరుగుతుంటాయి. ఆ రిస్కులను దృష్టిలో పెట్టుకుని ఏజెంట్స్‌ని అన్ని వివరాలు వివరంగా అడిగి తెలుసుకుని వారి అవసరాలకు అనుగుణంగా కారు ఇన్సూరెన్స్ తీసుకోవాలి.

Tags:    

Similar News